(దండుగులు శ్రీనివాస్, వాస్తవం ప్రతినిధి)
కేటీఆర్. మంచి విజన్ ఉన్న నేత. భవిష్యత్ అంతా తనదే. బాగా కష్టపడే మనస్తత్వం. కానీ ఎన్నో లోపాలు. వేసే ప్రతీ అడుగులో తప్పటడుగులు. తన కోటరీ చెప్పిందే వేదం. కోటరిలో ఉన్నదంతా అరకొర, మిడిమిడి జ్ఞానం విజ్ఞానులే. జిల్లా అధ్యక్షులు ఎంపికలోనే కేటీఆర్ పెద్ద అగాథంలో కాలేశాడు. తనకు నచ్చిన ఎమ్మెల్యేకు చాన్స్ ఇచ్చాడు. అతనికే ఆ నియోజకవర్గంలో గెలిచే చాన్స్ లేదు. అయినా వారికే ఇచ్చాడు. జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ, అనుబంధ సంఘాల పదవులు.. ఇలా ఎంతో మంది కేటీఆర్ ఇస్తాడేమోనని ఎదురుచూశాడు. వారందరికీ నిరాశే ఎదురైంది. ఎప్పుడు చూడు ఆ ఐటీ చుట్టూ ప్రదక్షిణలు. హైదరాబాద్ వదిలి రాని అతని ఆలోచనలు. పల్లెల్లో ఉన్న పరిస్థితులపై ఏమాత్రం పట్టులేని అవగాహన రాహిత్యం. కేసీఆర్ .. కేటీఆర్‌కు ఓ మంచి అవకాశం ఇచ్చాడు.
తనేందో నిరూపించుకునేందుకు. కానీ కేటీఆర్ అడుగడుగునా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఒక రామడు, మరో బీమడు, మరో జోగడు అంతే కేటీఆర్ చుట్టూ ఉన్నది. వారి లంగలు, దొంగలు అని ముద్రపడినా.. తనింటి మనిషేనంటాడు కేటీఆర్. ఇక్కడే దెబ్బ కొట్టింది. మంచి వాక్చాతూర్యం, పరిభాషా పటిమ, అనర్గళ ప్రసంగం ఆయన సొంతం. కానీ జనం నాడి పట్టడంలో పూర్తిగా వైఫల్యం. దీనికి తోడు అనవసర ఆవేశం. చంద్రబాబు అరెస్టుతో మాకేమవసరం అంటాడు. బీఆరెస్ పార్టీ ఎందుకు పెట్టాడో కూడా సరైన అవగాహన లేనట్టు మాట్లాడతాడు. తండ్రి మోడీతో సంబంధాలు, కొడుకు మోడీని చెడుగుడు ఆడుతాడు. పొంతన లేదు. సరైన పంథా లేదు. తీరా ప్రమాదం ముంచుకొచ్చింది. సీఎం కావాలనే ఆశలు చాలా దూరం వెళ్లాయి. ఓ దశలో కంటికి కానరాని , కనుచూపు మేరలో లేని పరిస్థితులు చేజేతులా క్రియట్ చేసుకున్నాడు కేటీఆర్.
కేసీఆరూ దీనికి బాధ్యుడే. మితిమీరిన అత్యుత్సాహం, అతి ఆత్మవిశ్వాసం, ఓవర్‌లుక్ .. తనకు తాను ఎక్కువగా ఊహించుకోవడం తనకే కాదు.. కొడుకు రాజకీయ భవిష్యత్తుకు గండి కొట్టింది. తేరుకోవడానికి చాలా సమయమే పడుతుంది. కానీ మంచే జరిగింది. అన్యాయంగా, నిరాశగా.. ఇంకా గంపెడాశలతో పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న సిన్సియర్ కార్యకర్తలు, నాయకులను ఇకనైనా గుర్తిస్తారేమో చూడాలి. ఆకాశం వీడి నేలకు దిగిరాక తప్పలేదే. దిగి వచ్చినా అదే మైండ్ సెట్‌తో ఉంటే కేసీఆర్ నమ్మే దేవుడు కూడా కాపాడలేడు.