అన్నీ మంచి శకునములే !
కర్ణాటక ఎన్నికల పట్ల కేసీఆర్ సంతృప్తి

వంద లోక్‌సభ స్థానాలపై కన్ను
జాతీయ రాజకీయాలపై కసరత్తు

కర్ణాటక ఎన్నికల పట్ల ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. బీజేపీ పరాభవం ఆయనకు ఊరట కలిగించింది. కర్ణాటకలో బీజేపీ మళ్ళీ గెలిస్తే జాతీయ రాజకీయాలలో ఆ పార్టీ మరింత రెచ్చిపోయి ఉండేది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట ఇబ్బందులు పెట్టేది. అందువల్ల బీజేపీ ఓటమి కేసీఆర్‌కు అనుకూలాంశం.

పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగలు బలంగా ఉన్న చోట హెచ్‌డి కుమారస్వామి నాయకత్వంలోని జనతా దళ్ ఎస్ ఘోరంగా దెబ్బ తినడం కూడా తమకు అనుకూల పరిణామమని బీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కుమారస్వామి కేసీఆర్‌తో బేషరతుగా కలిసి వస్తారు. కర్ణాటక ఉత్తర ప్రాంతంలో బలంగా ఉన్న లింగాయతులు బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉండటం కూడా తనకు అనుకూలాంశంగా బీఆర్‌ఎస్ భావిస్తున్నది. ఈ పరిస్థితిని ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకోవాలనే అంశం ఆధారంగా కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా కనీసం వంద లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలనేది బీఆర్‌ఎస్ వ్యూహంగా ఉంది. వివిధ రాష్ట్రాలలోని దాదాపు అన్ని నియోజకవర్గాలపై కేసీఆర్ ఇప్పటిక అధ్యయనం చేశారు. వంద సీట్లు అనేది ఆయన కనీస లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, లోక్‌సభ ఎన్నికల నాటికి వివిధ రాష్ట్రాలలోని పరిస్థితిని బట్టి పావులు కదుపుతారు. అనుకూలతను బట్టి ఇక భారీ సంఖ్యలో పోటీ చేసే అవకాశం కూడా ఉంది.

తెలంగాణతో పాటు కర్ణాటక, ఏపీలనుంచీ, మహారాష్ట్రలోని మరఠ్వాడా – విదర్భ ప్రాంతాల నుంచి ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలనేది కేసీఆర్ ఆలోచన అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశాలపై కూడా ఆయన కన్ను వేశారు. తమిళనాడుపై కూడా కసరత్తు సాగుతున్నది. దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులతో ఎటువంటి విభేదాలు తలెత్తకుండానే తనపని తాను చేసుక పోవాలని చూస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్‌సీపీ, శివసేనలకు మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాలలో పెద్దగా ప్రాబల్యం లేదు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలువడానికి కేసీఆర్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గతంలో రాజస్థాన్, మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా అక్కడి ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల ప్రతిపక్షం లో ఉన్న కాంగ్రెస్ కు లాభించింది. కానీ లోక్‌సభ ఎన్నికలలో ఈ రెండు రాష్ట్రాల ప్రజలు మోదీకే ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేక పోయింది. కర్ణాటకలో బీజేపీ సర్కారుకు వ్యతిరేక ఓటు వచ్చిందే తప్ప రాహుల్ పాదయాత్ర వల్ల కాదనేది తె లిసిందే. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికలలో మోదీని కాంగ్రెస్ ఢీకొనగలదా అనే అనుమానం బలంగా ఉన్నది. అదే జరగక పోతే కాంగ్రెస్‌కు గత ఎన్నికల మాదరిగా యాభై ప్లస్ సీట్లు కూడా రావు. గత ఎన్నికలలో ఎనిమిది సీట్లు డిఎంకే దయ వల్ల వచ్చినవే. మరో ఎనిమిది లోక్‌సభ స్థానాలు పంజాబ్ నుంచి తెచ్చుకున్నవి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోయి ఆప్ పాలన సాగుతున్నది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ శల్య సారథ్యంలో కాంగ్రెస్ నెగ్గుకు రాగలదా అనే అనుమానాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో యాభై సీట్లు తెచ్చుకున్నా కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పగలరు. ప్రాంతీయ పార్టీలలో బాదల్, కరుణానిధి, జయలలిత, ములాయం వంటి సీనియర్ నాయకులు ఇప్పుడు లేరు. లాలూ , పవార్ వృద్ధులై పోయారు. నవీన్ పట్నాయక్‌కు ఒడిశా దాటితే ఏమీ పట్టదు. ఇక మిగిలింది మమతా బెనర్జీ. ఆమె మొండి ఘటం కనుక ప్రతిపక్ష నాయకులకు ఆమోదయోగ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ నాయకత్వంల బలహీనపరిస్థితి నుంచి బయట పడి మోదీని ఎదుర్కోలేదు. ఈ పరిస్థితులే కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయి.
కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా కేసీఆర్ పట్ల పూర్వపు వ్యతిరేకతను ప్రదర్శించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జాతీయ రాజకీయాలను కేసీఆర్ ఆసక్తిదాయకంగా మార్చనున్నారు. ఇందుకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కసరత్తు సాగిస్తారు.

(తెలంగాణ సాలిడారిటీ ఫోరం)

You missed