నేనింతే…

అంతుచిక్కని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అంతరంగం..

వివాదాలకు కేంద్రంగా మారుతున్న భోదన్‌ నియోజకవర్గం….

ఎంఐఎంతో కటీఫ్‌… కయ్యానికి కాలుదువ్వే మాటలతో మరింత గందరగోళం…

తన షార్ట్‌టెంపర్‌ నిర్ణయాలు, మాటలతో అధిష్టానానికి తలనొప్పులు….

సొంతపార్టీలోనే ఎమ్మెల్యే వైఖరిని నిరనిస్తున్న వైనం…

 

బోధన్‌ నియోజకవర్గం వార్తల్లో కేంద్ర బిందువవుతోంది. షకీల్‌ వైఖరీ దీనికి ఆజ్యం పోస్తున్నది. మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న బోధన్‌ నియోజకవర్గం ఇప్పడు మరిన్ని హాట్‌ వార్తలతో, ఎమ్మెల్యే ఘాటు మాటలతో మరింత వేడెక్కింది. తనపై హత్యయత్నం జరిగిందంటూ కొంత మంది ఎంఐఎం నేతలపై కేసులు పెట్టించి జైలుకు పంపించడం.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌తో తొడకొట్టి చాలెంజ్‌లు చేయడం..లాంటి చర్యలు పార్టీనే కాదు.. బీఆరెస్‌ అధిష్టానానికీ తలనొప్పులను తెచ్చుపెడుతోంది.

సొంత పార్టీ నేతలపైనే కొంత మందిపై కక్షఫూరితంగా వ్యవహరించడం పట్ల కూడా ఆ పార్టీ నేతలు జీర్ణించకోవడం లేదు. వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఎమ్మెల్యేచర్యలతో ఆ పార్టీల్లో పరోక్షంగా జీవం పోస్తున్నట్టుగానే ఉందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. లోకల్‌లో అందుబాటులో లేడనే అపప్రద మూటగట్టుకున్న షకీల్‌… నియోజకవర్గంలో తిరిగే సమయంలో ఏదో ఒక గొడవ నెత్తినెత్తుకుంటున్నాడు. అనాలోచిత చర్యలతో, ఆవేశంతో తీసుకునే నిర్ణయాలతో వార్తల్లోకెక్కుతున్నాడు.

కనీసం తను నిర్ణయాలు తీసుకునే ముందు అధిష్టానాన్ని కనీసం అప్రోచ్‌ అవుతున్న సందర్బాలూ ఉండవు. ఎందుకంటే ఎంఐఎంతో ప్రస్తుతం బీఆరెస్‌ సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తున్నది. అసదుద్దీన్ అన్ని చోట్లా ఈసారి పోటీ చేస్తామని ప్రకటించినా.. నిజామాబాద్‌, బోధన్‌లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల బీజేపికి మేలు జరిగే అవకాశాలుంటాయి. ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య ఉన్న కారణంగా కేసీఆర్‌ ఈ స్థానాల్లో ఎంఐఎంను పోటీ చేయకుండా నిలువరించగలడు. కానీ ఇలాంటి పాలసీ మ్యాటర్‌ పైనా షకీల్‌ కయ్యానికి కాలుదువ్వి ఎంఐఎంను రెచ్చగొట్టడం పార్టీకి నష్టం కలిగించే చర్యలే అంటున్నారు సొంత పార్టీ నేతలు. మరోవైపు అన్యాయంగా తమ లీడర్లను హత్యాయత్నం కింద కేసులు పెట్టి జైలుపాలు చేశాడని ఎంఐఎం నేతలు బక్రీద్‌ సందర్బంగా… కామెంట్లు చేయడం వైరల్ అయ్యింది. పండుగలకు దూరం చేశాడని ఎమ్మెల్యే వైఖరిపై దుమ్మెత్తిపోయడం చర్చకు దారి తీసింది.

మొన్నటి వరకు అధిష్టానం షకీల్‌ను దూరం దూరం పెడుతూ వచ్చింది. బీఆరెస్‌ విస్తరణలో భాగంగా మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో కేసీఆర్‌కు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న తరుణంలో మళ్లీ తన సహజదోరణిలో వివాదాలకు తెరలేపాడు షకీల్‌. మొన్న సీఎంతో కలసి పండరీపూర్‌ టూర్‌కు కూడా వెళ్లకుండా దూరంగా ఉన్నాడు షకీల్‌. మరోవైపు నిత్యం ఏదో ఒక వివాదాన్ని కొని తెచ్చుకుని వార్తల్లో ఉంటున్నాడు. దీంతో ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో బోధన్ పాలిటిక్స్‌ చర్చలో భాగమయ్యాయి. షకీల్‌ వార్తల్లో కేంద్రబిందువయ్యాడు. ఇదెక్కడికి దారి తీస్తుందో తెలియదు. అధిష్టానం జోక్యం చేసుకుని దీనికి బ్రేకులు వేస్తుందా… రాజకీయం మరింత రచ్చకెక్కే పరిస్థితులు తెస్తుందా…. ? చూడాలి.

You missed