బీజేపీకి దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నదా..? మొన్నటి వరకు అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పోయిన బీజేపీకి.. కర్ణాటక షాక్‌నిచ్చింది. ఆ షాన్ నుంచే కోలుకోలేక, గ్రూపుల పంచాయతీలతో సతమతమవుతున్న క్రమంలో కొత్తగా జిల్లాలో శివసేన ఎంట్రీ ఇస్తోంది. ఇది అంతో ఇంతో ఉన్నది బోధన్ పట్టణంలోనే. గతంలో కూడా పోటీ చేసి రెండు వేలకు పైగా ఓట్లు సాధించి … అంతిమంగా షకీల్ గెలుపుకు దోహదం చేసింది. బీఆరెస్ మహారాష్ట్రలో విస్తరిస్తున్న క్రమంలో తెలంగాణలో దెబ్బకొడదామనే ఆ పార్టీ అధిష్టానం ఉద్దేశ్యం…లక్ష్యం ఇక్కడ తిరగబడనుందా… ? అవును ఇప్పుడు ఇదే చర్చ అంతటా జరుగుతోంది.
శుక్రవారం బోధన్ పట్టణంలో భారీ సభకు శివసేన ప్లాన్ చేసింది. తెలంగాణలోనే ఇది ఈ ఎన్నికల సీజన్‌లో తొలి మీటింగు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడి నుంచి ఈ సభ ద్వారా ఓ రకంగా ఎన్నికల శంఖారావంగా దీన్ని భావించేలా నిర్వహించాలని తలస్తున్నది. ఇది గ్రహించిన బీజేపీ శ్రేణులు ఈ సభ సక్సెస్ కాకుండా నిలువరించేందుకు నానా తంటాలు పడుతున్నారు. బీజేపీ శ్రేణులను ఈ మీటింగుకు వెళ్లొద్దని పెద్ద నేతలతో ఫోన్లు చేయిస్తున్నారు. ఈ మీటింగుకు శివసేన రాష్ట్ర అధ్యక్షుడు శింకార్ శివాజీ రానున్నారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, కమిటీల ఏర్పాటు.. ఎన్నికల్లో పోటీ తదితర విషయాలపై భవిష్యత్ కార్యాచరణను ఈ వేదికగా ప్రకటించాలనుకుంటున్నారు. అన్ని ఏర్పాట్లు చేశామని, బీఆరెస్‌ను దెబ్బ కొట్టడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా అధ్యక్షుడు, బోధన్ వాస్తవ్యుడు పసులోటి గోపీ కిషన్ అన్నారు.
అయితే ఇది అంతిమంగా బీజేపీకే గండి కొట్టే అవకాశాలున్నాయి. హిందుత్వం పేరుతో ఈ రెండు పార్టీలు ఎన్నికలకు పోతే బీజేపి పడే ఓట్లను శివసేన కొన్ని చీల్చనుంది. ఇది కాంగ్రెస్‌కో, బీఆరెస్‌కో మేలు జరగనుంది. కానీ గతంలో షకీల్ గెలుపులో శివసేనకు చీల్చిన ఓట్లు కీలకంగా పనిచేశాయని తెలుస్తోంది. దీంతో ఇది తమ కొంప ముంచేందుకే రంగంలోకి దిగతుందనే భావనలో, భయంలో, అయోమయంలో బీజేపీ శ్రేణులున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తామని, కమిటీలు వేసుకుంటామని చెప్పుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలా గెలుపు తీరాలకు చేరాలా అని తంటాలు పడుతున్న బీజేపీకి ఇప్పుడు శివసేక కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
అయితే బోధన్ లో గతంలో జరిగిన ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన గొడవ ఉద్రిక్తతకు దారి తీయటం.. అరెస్టులు… ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. కాగా ఈ గొడవల్లో ప్రధానంగా బీజేపీకే మైలేజీ వచ్చింది కానీ.. అరెస్టుల పాలయ్యింది మాత్రం తామేనని శివసేన నేతలు భావిస్తున్నారు. కనీసం బీజేపీ నేతలు శివసేన నేతలను పట్టించుకోలేదని, అరెస్టుల పర్వంలో పరామర్శలకు కూడా నోచుకోలేదనే కోపంతో ఉన్నారు. ఇప్పుడు పార్టీ పాలసీలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్న క్రమంలో .. జిల్లాలో మాత్రం శివసేన ప్రత్యర్థి వర్గం బీఆరెస్ కాకుండా బీజేపీయో అనేలా నేతల ప్రవర్తన ఉన్నదనిపిస్తోంది. అర్వింద్ పై శివసేన నేతలు ఒంటికాలపై లేస్తున్నారు. తమను పట్టించుకోలేదన్న భావన ఒకటి కాగా… మా పార్టీతో ఏమవుతుంది లే .. అనే చులకన భావాన్ని ఆ నేతలు తట్టుకోలేకపోతున్నారు. దీంతో పైకి చెప్పే సిద్దాంతం ఒకటైతే.. లోపల ఫైట్.. అంతిమ లక్ష్యాలు మరోలా ఉండనున్నాయి. అంతిమంగా ఈ దారితప్పిన సిద్దాంత వ్యూహాలు బీఆరెస్ నెత్తినే పాలుపోసేలా ఉన్నాయనిపిస్తోంది.