అది మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇలాఖ. బాల్కొండ నియోజకవర్గం. మంత్రిపై పోటీ అంటే అందుకు సమ ఉజ్జీ కావాలి. గట్టి పోటీ ఇవ్వాలి. ప్రతిపక్షం బలంగా ఉండాలి. మొదట బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నారు. ఈ పార్టీ టికెట్‌ కోసం సునీల్‌ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. అర్వింద్‌పై అధిష్టానానికి ఫిర్యాదుల వరకు వెళ్లింది. తనకు సర్వే రిపోర్టులో బాగా ఉందని, మల్లిఖార్జున రెడ్డికి ఎలా ఇస్తారంటూ అధిష్టానాన్నే ధిక్కరించాడు. అయినా డోంట్‌ కేర్‌. అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అర్వింద్‌ హవా జిల్లాలో నడుస్తోంది. ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌రెడ్డికి టికెట్‌ ఇప్పించుకున్నాడు.

బాల్కొండలో మల్లిఖార్జున రెడ్డికి హామీ ఇచ్చాడు. ఆ మేరకు మల్లిఖార్జున్‌ రెడ్డి తన ప్రచారం తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు సమస్యంతా సునీల్‌దే. ఒకప్పుడు బీఎస్‌పీ నుంచి పోటీ చేసి నలభై వేల పై చిలుకు ఓట్లు సాధించిన సునీల్‌.. తనకు మంచి పార్టీ ప్లాట్‌ఫాం దొరికితే తిరుగులేదనుకున్నాడు. అందుకే మొదట బీజేపీని పట్టుకుని వేలాడాడు. అక్కడ వాతావరణం పొసగలేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కానీ ఇక్కడ జిల్లాలో అర్వింద్‌ను కాదని ఏమీ చేయలేని పరిస్థితి.

ఇదిలా ఎటూ తేలని పరిస్థితి సునీల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో .. కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో ఓ ఊపు వచ్చింది. దీంతో కాంగ్రెస్‌ కూడా పర్వాలేదు అనే భావనకు వచ్చాడు సునీల్. ఇప్పుడు అక్కడ నుంచి నరుక్కుంటూ వస్తున్నాడు. కానీ అక్కడ సునీల్‌ను నమ్మే పరిస్థితి లేదు. పార్టీ టికెట్ ఇచ్చినా.. గెలిచినా… తను పార్టీలో నిలకడగా ఉంటాడా..? మళ్లీ తనకు అనుకూల పార్టీ, పదవి, పరపతి కోసం జంప్‌ అవుతాడా..? అనే అనుమానాలు ఉన్నాయి. వాస్తవంగా ఈ అనుమానాలు బీజేపీలోనూ ఉన్నాయి.

అలాంటి నిలకడలేని మనస్తత్వం సునీల్‌ది అని ఈ రెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు లోలోపల సునీల్‌ తన పని తాను చేసుకుపోతున్నాడు. కానీ ఏ పార్టీయో తెలియదు. కార్యకర్తలకు, నాయకులకూ అయోమయమే. ఏం చెప్పుకుందాం..? ఏం మాట్లాడుదాం.. ? ఏ పార్టీ కండువా కప్పుకుందాం…?? పాపం అన్నీ ప్రశ్నార్థకాలే. ఇంకో నెల ఆగండి నా నిర్ణయం చెబుతా అని అంటున్నాడు సునీల్‌ రెడ్డి. తన అంచనాలు తనకు ఉన్నాయని, తాను ఏ పార్టీనుంచి పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఏ పార్టీయో నిర్ణయం మాత్రం తీసుకోలేకపోతున్నాడు.

అప్పుడెప్పుడో బీఎస్పీ ఓట్లు తనకు ఎన్నో వచ్చాయని, అదే పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు చెబుతూ… ఇప్పుడు మారిన సమీకరణలు తనకు మరింత ఓట్లు తెచ్చిపెడతాయని, గెలుపు తీరాలకు చేర్చుతాయని చెప్పుకొస్తున్నాడు. కేవలం పైసా ఉంటే సరిపోదు.. క్యారెక్టర్‌ కూడా ముఖ్యమే కదా. అది లేనప్పుడు నమ్మెదెలా..? టికెట్‌ ఇచ్చేదెలా…? నీ కంటే మేమే ఎవరో ఒకరం పోటీ చేస్తాం.. మేమేమన్నా తక్కువా ..? అని సర్దిచెప్పుకుంటున్నారు కాంగ్రెస్‌ బాల్కొండ లీడర్లు.

You missed