ప్రజల కళ్లు బాగు చేయాలన్న ఆలోచన ఏ సీఎంకైనా వచ్చిందా..? ఎవరైనా వచ్చి తమ కంటి చూపు మందగించింది.. ప్రభుత్వం పట్టించుకోవాలని అడిగారా..? సీఎం కేసీయారే స్వయంగా కంటి వెలుగు పథకాన్ని రచన చేశారు. అందరికీ కంటి పరీక్షలు చేశారు. కళ్లద్దాలూ అందించారు… అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సంక్షేమ సంబురాల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కానీ ప్రతిపక్షాలకు తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కంటికి కానరావడం లేదని, వారి కంటి చూపు మందగించిందని ఆమె ఎద్దేవా చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల కోసం ప్రత్యేకంగా కంటి వెలుగు శిబిరాలు చేయాలని ఆమె బాజిరెడ్డి గోవర్దన్‌కు సూచించారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ఓ ఆర్థితో రూపొందించి పేద ప్రజలకు అందేలా అమలు చేస్తున్నారని , ఇది దేశంలోని ఏ రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం లేదన్నారు. మన దగ్గర కాపీ కొట్టి కొన్ని పథకాలు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నా.. ప్రజలతో మనకున్న అటాచ్‌మెంట్, కమిట్‌మెంట్ వారికి లేదన్నారు. అందుకే అవి ప్రచారాలకే పరిమితమవుతున్నాయని, మన పథకాలు ప్రజల గుండెల్లో నిలుస్తున్నాయన్నారు. కేసీఆర్‌ను అందుకే ప్రజలు అంతలా ఆదరిస్తున్నారని, ఆశీర్వదిస్తున్నారని అన్నారామె.