ఆ ఇద్దరు ‘మహా’ బిజీ

ఆర్మూర్‌, బోధన్‌ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర బీఆరెస్‌ బాధ్యతలు..

నియోజకవర్గానికి దూరమయ్యారని ఫీలవుతున్న నేతలు, కార్యకర్తలు.

ఇంతకు ముందు కనీసం హైదరాబాద్‌ వెళ్లైనా కలిసొచ్చేవాళ్లం.. ఇప్పుడు అపాయింట్‌మెంట్‌ లేదు.. దర్శనం లేదు..

ఎమ్మెల్యే రాక కోసం ఆ రెండు నియోజకవర్గాలు ఎదురుచూపులు…

నిజామాబాద్ ప్రతినిది- వాస్తవం:

ఆర్మూర్‌, బోధన్‌ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బిజీ బిజీ అయ్యారు. బీఆరెస్‌ పార్టీ మహారాష్ట్ర బాధ్యతలు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇవ్వడమే దీనికి కారణం. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌లకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రలో ఏ మీటింగు జరిగినా… పార్టీలో వలసలను ప్రోత్సహించి తీసుకురావాలన్నా.. సీఎంతో అపాయింట్‌మెంట్‌ తీసుకుని వారిని కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేర్పించాలన్నా ఈ ఇద్దరు నేతలు కీలకంగా మారారు.

ఈ బాధ్యతలనూ వారికే ఇచ్చారు మరి సీఎం కేసీఆర్‌. దీంతో పోటీలు పడి వీరు సభలు సక్సెస్‌ చేయడం.. మహారాష్ట్రలోని ఇతర పార్టీల నుంచి బీఆరెస్‌లో చేర్పించడం తీవ్రంగా కృషి చేస్తున్నారు. నజరంతా అక్కడ్నే పెట్టారు. ఈ నేతలు ఫోన్లూ ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటాయి. వారి నియోజకవర్గాల నేతలతో కాదు.. మహారాష్ట్ర రాజకీయాలతో, నేతలతో సంప్రదింపులతో. ఈ ఇద్దరు ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు. వారి నియోజకవర్గ ప్రజలతో, కార్యకర్తలతో, నేతలతో కాదు…. మహారాష్ట్ర నేతలతో, అక్కడి రాజకీయాలతో. ఇదీ పరిస్థితి. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు తమ ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

నాందేడ్‌, ఔరంగబాద్‌ సభలను సక్సెస్‌ చేసిన ఊపులో ఉన్నారు ఈ ఇద్దరు నేతలు. కానీ తమ నియోజకవర్గానికి మాత్రం టైమ్ ఇవ్వలేకపోతున్నామనే అంతర్మథనమూ వారిని వెంటాడుతోంది. గతంలో నియోజకవర్గానికి నేతలు రాకపోతే.. తామే హైదరాబాద్‌ వెళ్లి కలిసేవాళ్లమని, పనులు చేయించుకునేవాళ్లమని, ప్రజల సమస్యలు చర్చించేవాళ్లమని .. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవని వాపోతున్నారు. అధినేత కేసీఆర్‌ తమ నేతలకు పెద్ద బాధ్యతలను అప్పగించాడని సంతోషించాలో.. నియోజకవర్గానికి దూరమయ్యారని బాధపడాలో తెలియక అయోమయంలో ఆగమాగమవుతున్నారు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలు, నాయకులు.

You missed