బలిగంప బయిల్దేరింది…
——————-
పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు.
ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి!

* *
ప్రభాకర్ నా కంటే ఓ ఏడాది చిన్నవాడే. నాకు లానే చానాళ్లుగా చక్కెర వ్యాధితో బాధపడుతున్నవాడే. అయితే, ఆయన అకాలమరణం అందుకు కాదు నన్ను బాధ పెడుతోంది. తన 30 ఏళ్ల జర్నలిస్టిక్ కెరీర్ లో చివరి మజిలీ- నేను ఎడిటర్ గా ఉన్న డెస్క్ కావడం, ఆయన ఉసురు తీసిన పాపంలో నాకూ కొంత భాగస్వామ్యం ఉండటం – నా క్షోభకి కారణాలు.

* *
ప్రభాకర్ ఊరు- ఖమ్మం నేలకొండపల్లి గ్రామం. చదువుకున్నాడు, ప్రపంచాన్ని చూశాడు, నలుగురితో మెలిగే లౌక్యం నేర్చాడు, సమాచారాన్ని సేకరించగలిగే నాలుగు పరిచయాలు చేసుకున్నాడు- ఇంతకంటే ఒక రిపోర్టర్ నుంచి ఎవరైనా ఏం ఆశిస్తారు! ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలకి 30 ఏళ్ల నాడు స్థానికి విలేఖరి (స్టింగర్)గా పనిచేశాడు. అదే ఊరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ భార్గవ్ కంట్లో పడ్డాడు. ప్రభాకర్ లో ఉత్సాహాన్ని, అర్హతనీ గుర్తించిన భార్గవ్ – ఆంధ్రజ్యోతి – హైదరాబాద్ బ్యూరోకి తెచ్చారు.
‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా చాలా కాలం చేశారు. బిజినెస్ రిపోర్టింగ్ అంటే ప్రభాకర్ కి ప్రత్యేకమైన ఇష్టం. రవాణాశాఖ, ఉద్యోగసంఘాల బీట్లు రెగ్యులర్ గా చూశారు. కారణాలు తెలియవు గానీ, రిపోర్టింగ్ నుంచి ఆయన డెస్క్ కి మార్చబడ్డారు.

డెస్క్- రిపోర్టింగ్ ఎందులో చేసినా, జర్నలిస్టే (ప్రూఫ్ రీడర్ కూడా నిర్వచనం ప్రకారం జర్నలిస్టే) గానీ, రెండింటికీ మధ్య బైట ప్రపంచానికి పట్టింపులేని,తెలియని దూరం ఉంటుంది. ముఖ్యంగా రిపోర్టర్ ని డెస్కులో వేయడం అంటే, చేపని ఒడ్డున పడేయడమే (అయితే, ఎవర్ని ఎక్కడ వాడుకోవాలి- అన్నది యాజమాన్యం prerogative కాబట్టి ఏ మార్పిళ్లు, బదలీల మీద ఏ వివాదానికి తావు లేదు). ఒడ్డున వేసిన చేపని చెట్టెక్కమని ఆదేశించడం- ప్రభాకర్ విషయంలో జరిగిన మరో అదనపు అదిలింపు.
ప్రింట్ మీడియా రిపోర్టింగ్ నుంచి డిజిటల్ మీడియా డెస్క్ కి వచ్చి పడ్డాడు ప్రభాకర్. బ్రతుకుతెరువు కాబట్టి కొందరు తప్పక అలవాటు పడతారు; మరి కొందరు అలవాటు పడలేక పెనుగులాడతారు. అలా రోజువారీ పెనుగులాట బారిన పడిన బాపతే- పెందుర్తి ప్రభాకర్.

14 నెలల క్రితం నేను ఇంటర్నెట్ ఎడిషన్ కి డిజిటల్ ఎడిటర్ గా చేరిన కొత్తలో, colleagues బలాబలాల మీద ఒక అంచనాకు వచ్చే క్రమంలో – ప్రభాకర్ సంఘర్షణ అర్థమయ్యింది. కొన్ని సమయాల్లో ఆయన నిర్లక్ష్యం… నిష్పూచీ … బాధ్యత… బద్ధకం.. అదే విధంగా, ఇంటర్నెట్ డెస్క్ – బిజినెస్ కేటగరీకి ఏకైక కాంట్రిబ్యూటర్ గా ఆయన indispensability కూడా అర్థమయ్యాయి.
అన్నీ అర్థం చేసుకున్నంత మాత్రాన, ప్రభాకర్ పని ఎగవేతకి excuse ఉండదు కదా. అందుకని, ప్రోడక్ట్ తక్కువగా, పేజ్ వ్యూస్ స్వల్పంగా వస్తున్న కొలీగ్స్ ని అప్రమ్మత్తం చేసినట్లే, ప్రభాకర్ ని కూడా alert చేశాను. డెస్క్ వర్కుతో పాటు, తనకి సహజంగా ఉన్న రిపోర్టింగ్ స్కిల్స్ తో ప్రత్యేక కథనాలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తానని ప్రభాకర్ ఇచ్చిన హామీని బాసులకి చేరవేసి నచ్చచెప్పాను.

అదలా ఉంటే, తప్పంతా ఎడిటోరియల్ స్టాఫ్ మీద గుమ్మరిస్తే కుదరదనీ, సాంకేతికంగా కూడా సవాలక్ష సమస్యలతో వెబ్ సైట్ కునారిల్లుతోందన్న నిజాన్ని మేనేజ్మెంటుకి నొక్కిచెప్పడం, వాటిని ముఖ్యంగా అడ్రెస్ చేయాకుండా ఎడిటోరియల్ డెస్క్ ని తప్పుబట్టకూడదనడం పై బాసులకి రుచించలేదు. నా డెస్క్ స్టాఫ్ మీద చాడీలు చెప్పకుండా, ఫిర్యాదులు మోయకుండా, ఎవ్వరినీ scapegoats చేయకుండా, వాళ్లనే వెనకేసుకొస్తున్నాననీ నా పనితీరు మీద కినుక వహించారు పెద్దలు.

అటువంటి దశలోనే అధికార స్థానానికి కొత్త నియామకం జరిగింది. కొత్త బాస్ నడమంత్రపు అధికారంతో తలలు తీసేయడమే ఎజెండాలో తొలి కార్యక్రమంగా నిర్ణయమయ్యింది. ఉద్యోగంలోంచి తీసేయాలంటే కంపెనీ – మూడు నెలల జీతం (కనీసం ఓ నెల సేలరీ అయినా) ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, ఆ ఖర్చు కూడా ఎగవేయడానికి, పొగపెట్టి పంపించేయాలని పథకాలు సిద్ధమయ్యి, జాబితా ఖరారయ్యింది.
హిట్ లిస్టులో ఉన్న స్టాఫుతో మాట్లాడాల్సిందేననీ, వారికి కనీసం ఒక నెల అయినా అవకాశం ఇవ్వాల్సిందేననీ యాజమాన్యాంకి శతవిధాలా నచ్చచెప్పడానికి ప్రయత్నించాను, విఫలమయ్యాను.
పొగబెట్టి పంపించే కుట్రకి తగ్గట్టుగా, Modus operandi అమలు చేయబడింది:
“తక్షణం నీ విధులు మార్చేస్తున్నాం. ఫలానా డిపార్టుమెంటులో రిపోర్ట్ చేయండి…” అని మౌఖిక ఆదేశాలు జారీఅయ్యాయి.
“ఒక డస్ట్ బిన్ ని, కుర్చీని, ఒక కంప్యూటరుని ఎలా షిఫ్ట్ చేస్తామో, ఒక ఉద్యోగిని (జర్నలిస్టుని) కూడా అదేవిధంగా మార్చేయడం అన్యాయం. ఏ విభాగానికి మార్చబోతున్నామో ముందస్తుగా చెప్పడం, అది పాత్రికేయ సంబంధమైన పనేనా, లేకపోతే, మరో హౌస్ కీపింగ్ బాధ్యతనా- వంటివి వివరించి, నచ్చజెప్పడం – అనే కనీస సంస్కారం లేకుండా ఉన్న ఫళాన గెంటేయడం చాలా తప్పు…” అని వాదించాను. చెవిటి మేనేజ్మెంట్ ముందు శంఖమూదినా ప్రయోజనం లేకపోయింది,

చాలా మథనపడ్డాడు ప్రభాకర్. తలకొట్టేసినట్టు అవమానం ఫీలయ్యాడు. అయినా పొట్టకూటి కోసం తప్పక కొత్త డిపార్టుమెంటులో చేరాడు. అన్నివిధాలా ఒత్తిడికి లోనయ్యాడు, “సార్ మన డెస్కుకి వచ్చేస్తాను, ఇక్కడ చేయలేను… ” అని దీనంగా ప్రాథేయపడి నన్ను మరింత న్యూనతకి లోనుచేశాడు.
తట్టుకోలేని ఆ ప్రెషర్ లో షుగర్ లెవల్స్ పెరిగి అనారోగ్యం తిరగబెట్టింది. సరిగా ఆఫీసుకు రావడం లేదని మేనేజ్మెంట్ ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికింది. అప్పటికే ముగ్గురు… నలుగురి తలలు తెగిపడటంతో ఇక ఎవరి కాళ్లూ పట్టుకొని ప్రయోజనం లేదని వాపోయాడు.
ఆస్పత్రిపాలయ్యాడు. మూడు రోజుల క్రితం తెలిసింది, ఇంఫెక్షన్ సోకి- ఒక కాలు తీసేశారట. అయినా ప్రయోజనం లేకుండా పోయిందట, ప్రాణాలు కాపాడలేకపోయారు డాక్టర్లు- నిన్న ఉదయం కన్నుమూశాడు ప్రభాకర్.
* *
అకాలమృత్యువు పెందుర్తి ప్రభాకర్ ని మింగేసింది.
గావు పట్టడం పూర్తయ్యింది…. బలిగంప బయిల్దేరింది!
* * **
(నా పాతపోస్ట్ (bit.ly/3HShGbX) చూసినవాళ్లకి ఈ క్రతువు గురించి తెలియంది కాదు)

#ABNAndhraJyothyDiaries

 

Naresh Nunna

You missed