జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులంటే అంతే. రాజకీయ నాయకులకు అదో క్రీడ.. అవసరమున్న వాడుకోవడానికి అదో తాయిళం. ఎన్నికల వేళ అదో మత్తు మహత్యం.. హామీల అల్ప సంతోషం.. అంత వరకే. అవి వచ్చేవి లేదు. అలా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిందే. సరే ఈ కథంతా ఎప్పుడూ ఉండేదే కానీ… హైదరాబాద్‌లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు విషయం ఇప్పుడు రచ్చ రచ్చ అయ్యింది. తాజాగా కేటీఆర్‌ కామెంట్‌తో వర్గాలుగా విడిపోయారు. మంత్రిగారి ముచ్చట జర్నలిస్టుల మధ్య చాట్ల తవుడు పోయి కుక్కల కొట్లాట పెట్టినట్టే ఉంది. పద్నాలుగేళ్ల క్రితం జవహార్‌ లాల్‌ నెహ్రూ హౌజింగ్‌ సొసైటీ పేరుతో దాదాపు వెయ్యి మందికి పైగా జర్నలిస్టులు రెండు లక్షల రూపాయలు ఇళ్ల స్థలాల కోసం కట్టారు. వారికి బాచుపల్లి, నిజాంపేట్‌లలో వీరికి స్థలాలు కేటాయించారు. అది కోర్టు కేసుకు ఎక్కడంతో పద్నాలుగేళ్ల తర్వాత ఎన్వీ రమణ దీనికి పరిష్కారం చూపి వెళ్లారు.

వెంటనే వీరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తీర్పు నిచ్చారు. అప్పటికే ఇందులో నలభై, యాభై మంది జర్నలిస్టులు చనిపోయారు. ఆ కుటుంబాలు ఎప్పటినుంచో ఘోషిస్తున్నాయి. ఎట్టకేలకు సుప్రీం తీర్పుతోనైనా తమకు ఆ విలువైన ఇళ్ల స్థలాలు వస్తాయని భావించారు. సర్కారు దీనికి ఓకే అంది. కానీ .. ఇక్కడే ఓ మెలిక పెట్టారు మిగిలిన జర్నలిస్టులు. వారికి ఇస్తే మరి మాకు అన్నారు. కానీ ఆ స్థలానికి, వీరికి సంబంధమే లేదు. సర్కార్‌ కావాలంటే అదే సమయంలో వేరే చోట మరో స్థలాన్ని కొని వారికి ఇవ్వొచ్చు.కానీ అలా చేయకుండా ఇద్దరి మధ్యా తగాదా పెట్టింది. చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టిన్టటు.. తమాషా చూస్తుంది. ముందు మీరు మీరు తేల్చుకోండని ఓ మాట చెప్పేసి చేతులు దులుపేసుకుంది.

వాస్తవానికి సుప్రీం తీర్పు ఇచ్చిన ఈ ప్రత్యేక కేసులో అప్పుడు పైసలు కట్టిన దాదాపు వెయ్యి మందికి ఆ స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలి. వీరికి కాకుండా ఈ ప్లేస్‌లో ఏ ఒక్కరికి అదనంగా కేటాయించినా.. మళ్లీ ఇది కోర్టు చిక్కుల్లోకి పోయి నోటి కాడికి వచ్చిన బుక్క మట్టిలో కలుస్తుంది. కానీ రాజకీయాలకు ఇది అవసరంలేదు. కేటీఆర్‌కూ ఇది అనవసరం. అందుకే అదే రాజకీయం ఫాలో అవుతున్నాడు. అందరికీ అనేపేరుతో ఎవరికీ లేకుండా.. రాకుండా చేస్తున్నాడు. ఎన్నికలు రానే వస్తాయి. పోనే పోతాయి. ఇప్పడేమో మోకాలికి బోడి గుండికి ముడిచేశారు. అప్పటి వరకు తమాషా చూస్తారు. మళ్లీ బీఆరెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముచ్చట గురించి తాపీగా మట్లాడతారు. మరో ఐదేళ్లు గడిపేస్తారు. అప్పటి వరకు చచ్చేదెవడో.. ఉండేదెవడో.. ఇచ్చెదెవడికో… దక్కేదెవడికో…?

You missed