దాడికి ప్రతిదాడి, ఎత్తుకు పై ఎత్తు… కుట్రకు కుతంత్రం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇవి కామన్ అయిపోయాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొన్నటిదాకా హీరోగా వెలిగిపోయిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి … ఇప్పుడు జైలుకు వెళ్లనున్నాడా..? ఈడీ అతన్ని అరెస్టు చేయడానికి సర్వం సిద్దం చేసిందా..? అవుననే సమాధానాలే వస్తున్నాయి. వాస్తవాలు అలాగే ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపైఒ ఓ వైపు సీబీఐ విచారణ పేరుతో ఒత్తిడి పెంచుతుండగా…ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న రోహిత్‌రెడ్డిని అరెస్టు చేయడానికి రంగం సిద్దం చేసింది ఈడీ.
బీజేపీ …. టీఆరెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిందని సాక్షాలతో సహా దొరకబట్టి బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశాడు కేసీఆర్. ఇక్కడే బీజేపీకి మండింది. ఎమ్మెల్యేల బేరసారాలు నిజమే..రోహిత్‌రెడ్డి ఆల్‌రెడీ ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మారిందీ నిజమే. ఇప్పుడు బీజేపీ కూడా అదే ఉచ్చు వేసి లాగేందుకు ప్రయత్నం చేసిందీ నిజమే.చివరకు ఈ బేరసారాలు బెడిసికొట్టాయి. కేసీఆర్ చేతికి వ్యూహాత్మకంగా చిక్కారు కొనుగోలు వ్యవహారంలో ఉన్న మధ్యవర్తులు. రేవంత్‌రెడ్డి తరహా ఓటుకు నోటు కేసులాగా దీన్ని బాగా వాడుకోవాలని కేసీఆర్ ఆలోచించాడు. కానీ అంతలా మైలేజీ రాలేదు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ హీరో చేద్దామనుకున్నాడు కానీ.. జనాల్లో ఇది పెద్దగా చర్చకు రాలేదు.
మొన్న మల్లారెడ్డి ఆర్థిక మూలాలపై ఐటీ దాడులు చేసి హల్చల్ చేసిన కేంద్రం… ఇప్పుడు రోహిత్‌పై ఈడీ దాడి చేయించింది. పక్కాగా కేసులో ఇరికించి అరెస్టు చేసి పగసాదిద్దామనే దోరణిలోనే కేంద్రం సీరియస్‌గా వెళ్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బీఆరెస్, బీజేపీల మధ్య రాజకీయ క్రీడ రసవత్తరంగా సాగుతోంది.