క‌రోనా … మ‌నిషుల జీవితాల‌ను చిన్నాభిన్నం చేసి వెళ్లింది. అలా వెళ్లి ఇలా వ‌చ్చి వేవ్‌ల పేరుతో ప్రాణాల‌తో ఆడుకున్న‌ది. జీవితాల‌ను కాల‌రాసింది. కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసింది. బ‌డ్జెట్‌ను త‌ల‌కిందులు చేసింది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అల్ల‌క‌ల్లోలం చేసింది. మూడో వేవ్ వ‌స్తుంద‌నే భ‌యం ఇంకా వెంటాడుతూనే ఉంది. క‌రోనా వ‌చ్చి జీవ‌న ప్ర‌మాణాల‌ను త‌గ్గించింది. జీతాల్లో కోత‌లు విధించేలా చేసింది. ఉద్యోగాలే లేకుండా చేసింది. మార్కెట్లో మాత్రం రేట్లు ఆమాంతం పెరిగిపోయేలా దోహ‌ప‌ప‌డింది. అదేంటీ..? క‌రోనా వ‌చ్చి అంతా ఆగ‌మైతుంటే ఈ ధ‌ర‌లు ఇలా ఆకాశాన్నంటేలా ఎందుకు పెరిగాయ‌బ్బా..? అనుకున్నారు. ఎవ‌రికీ అర్థం కాలేదు.

చ‌చ్చేవాడు చావంగా.. ఉన్నోడిని దోచుకు తినే బ్యాచ్ త‌యార‌య్యింది. మ‌నుషులు క‌ళ్ల‌ముందే చ‌చ్చినా.. బ‌తికున్న మ‌నుషులు మాత్రం త‌మ త‌మ వ్యాపారాల్లో ఆరితేరిపోయారు. జీవ‌చ్చవాల్ల మారిన మ‌నుషుల‌నూ వ‌ద‌ల్లేదు. ర‌క్తం పీల్చి పిప్పి చేస్తున్నారు. మూడో వేవ్ బూచీ ఇంకా జ‌నంతో ఆడుకుంటూనే ఉంది. చేతి నిండా ప‌నిలేదు. క‌డుపు నిండా తిండి లేదు. క‌ట్టేందుకు ఫీజుల‌కు పైస‌ల్లేవు. కిరాయిలు క‌ట్టేందుకు అప్పులు చేయ‌డం ప‌రిపాటిగా మారింది.

ఈ ఉప‌ద్ర‌వం వీడెదెన్న‌డో… ఈ విప‌త్తు నుంచి స‌మాజం బ‌య‌ట‌ప‌డేదెన్న‌డో..? ఇదో విల‌యం. అంత ఈజీగా బ‌య‌ట‌ప‌డ‌టం కుద‌ర‌దు. స‌మ‌యం కావాలి. ఎంతో చెప్ప‌లేం. కాల‌మే దీనికి స‌మాధాన‌మిస్తుంది. బ‌య‌ట జ‌నాలు మామూలుగానే తిరుగుతున్నారు. కానీ వారిని క‌దిలిస్తే గానీ తెలియ‌దు.. ఒక్కొక్క‌రిదీ ఒక్కో గాయం. ప్ర‌తి మ‌నిషి ఓ గాయ‌ప‌డ్డ మ‌న‌సుతో కొత్త బ‌తుకుకు కోసం ప‌డే ఆరాటం.

 

You missed