కార్పొరేట్‌, ప్రైవేటు స్కూళ్లు అన‌గానే ఫీజులు దండుకునేవి.. ఫీజుల పేరుతో ర‌క్తం పీల్చేవిగా క‌నిపిస్తాయి. అక్క‌డ మేనేజ్‌మెంట్లు పేద , మ‌ధ్య త‌ర‌గ‌తి త‌ల్లిదండ్రుల‌కు య‌మ‌కింక‌రుల్లా క‌నిపిస్తారు. త‌మ తాహ‌తుకు మించి ఫీజులున్నాయ‌ని తెలిసినా.. పిల్ల‌లు బాగా చ‌ద‌వాలి.. ప్ర‌యోజ‌కులు కావాలి… వారికోస‌మే క‌దా మేమున్న‌ది…అప్పులు చేసైనా చ‌ద‌విస్తామ‌ని అనుకుని వేస్తారు. ఆ త‌ర్వాత వారి అప్పుల తిప్ప‌లు వారివి. ఇవ‌న్నీ మొన్న‌టి వ‌ర‌కు. ఇప్పుడు క‌రోనా ప‌రిస్థితుల‌ను పూర్తిగా మార్చేసింది. ఫీజులు వ‌సూలు చేసి కోట్లు సంపాదించుకున్నార‌ని అనుకున్న జ‌ల‌గ‌లు.. ఇప్పుడు అప్పులు క‌ట్ట‌లేక ఆత్మ‌హ‌త్య‌ల వైపు చూస్తున్నారు. మొన్న‌టి దాక అంద‌రికీ క‌నిపించ‌ని వారి రెండో వైపు జీవితం.. ఇప్పుడు క‌రోనా బ‌య‌ట‌పెట్టింది.

ఫీజులు రాక‌, అప్పులు క‌ట్ట‌లేక .. బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలే శ‌ర‌ణ్య‌మ‌నే స్థాయికి వ‌చ్చారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు నిర్వీర్య‌మ‌వుతున్న త‌రుణంలో ఇంగ్లీష్ మీడియం చ‌దువుల కోసం త‌ల్లిదండ్రులు ప్రైవేటుపైనే ఆధార‌ప‌డుతున్నారు. ఆధార ప‌డాల్సి వ‌స్తున్న‌ది. అంతో ఇంతో చ‌దువు మంచిగా దొర‌కుతుందంటే అందులోనే మ‌రి. పాల‌కులు నానాటికీ స‌ర్కారు స్కూళ్ల ఉనికినే ప్ర‌శ్నార్థ‌కంగా చేస్తున్న సంద‌ర్భంలో ఇప్పుడు విద్య .. కేవ‌లం ప్రైవేటు లోని దొరుకుతుంది. కొనుక్కుంటేనే ల‌భిస్తుంది. అంతే.

చాలా మంది ప్రైవేటు స్కూళ్ల మేనేజ్‌మెంట్‌ను క‌రోనా కోలుకోలేని దెబ్బ‌తీసింది. ఇది ఓ లాభ‌దాయ‌క‌మైన వ్యాపారం చాలా మందికి. స‌రే .. విద్య కూడా అదే రీతిలో ఇస్తున్నామ‌నేది కూడా వాస్త‌వ‌మే. పెద్ద పెద్ద భ‌వ‌నాలు అద్దెకు తీసుకుని, లేదా వారే బ్యాంకుల్లో లోన్లు తీసుకుని క‌ట్టుకుని న‌డుపుతున్న‌వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎలాగూ ఫీజులు వ‌స్తాయి క‌దా అనే ధీమా. ముక్కు పిండి వ‌సూలు చేయొచ్చ‌నే నమ్మ‌కం. కానీ, క‌రోనా విద్య వ్య‌వ‌స్థను కాటేసింది. అది ఇప్ప‌ట్లో కోలుకోని స్థితికి చేరుకున్న‌ది.

చూసీ చూసీ .. ఓపిక ప‌ట్టి ప‌ట్టీ.. అప్పుల బాధ భ‌రించి భ‌రించీ.. ప‌రువు ఆత్మ‌హ‌త్య‌ల వైపు చూస్తున్నారు మేనేజ్‌మెంట్‌. క‌ర్నూల్‌లో ఇటీవ‌ల ఓ క‌ర‌స్పాండెంట్ దంప‌తులు త‌మ కారులోనే పురుగుల మందు తాగి వీడియో తీసి చ‌నిపోవ‌డం ప్ర‌తీ ఒక్క‌రినీ క‌దిలించింది. మొన్నటి వ‌ర‌కు వారంతా ర‌క్తం పీల్చే జ‌ల‌గ‌లే కావొచ్చు… క‌ఠినంగా ముక్కుపిండి మ‌రీ ఫీజులు వ‌సూలు చేసే క‌ర్క‌శ మ‌న‌స్కులే కావొచ్చు కానీ.. ఆ జీవితాల వెనుక ఇప్పుడు హృద‌య‌విదార‌క ప‌రిస్థితులు గూడుక‌ట్టుకుని ఉన్నాయి. పిల్ల‌ల‌కు విద్యాబుద్దులు నేర్పి ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగేలా చేసే వీరే ఇప్పుడు త‌నువులు చాలించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆత్మ‌విశ్వాసం న‌శించి.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డానికి ధైర్యాన్ని ప్రోది చేసుకుంటున్నారు.

ఆంధ్ర‌లో ఒక్క‌ విద్యార్థికి ఏడాదికి 15వేలు ఇస్తున్నారు. ట్యాబులిస్తున్నారు. మ‌న ద‌గ్గ‌ర ఎందుకు ప‌ట్టించుకోరు. ఈ వ్య‌వ‌స్థ‌ను ఎందుకు ప‌ట్టించుకోదు ప్ర‌భుత్వం? కీల‌క‌మైన వైద్యం, విద్య‌ను విస్మ‌రించి ప్ర‌భుత్వం ఏం సాధించాల‌నుకుంటుంది? పాఠాలు చెప్పిన ఆ గొంతులు పూడుకుపోతున్నాయి. బంగారు జీవితాల‌ను తీర్చిదిద్దే వాళ్ల జీవితాల‌ను వారంత‌ట వారే స‌మాధి చేసుకుంటున్నారు.

You missed