హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వ్య‌య ప్ర‌యాస‌ల‌కు గుర‌వుతున్నదో క‌న‌బ‌డుతూనే ఉన్న‌ది. వేల కోట్లు గుమ్మ‌రించేందుకు రెడీ అవుతున్న‌ది. ఇప్ప‌టికే లోక‌ల్ టీఆర్ఎస్ లీడ‌ర్లంద‌రినీ కొనుగోలు చేసుకున్న‌ది. 5 ల‌క్ష‌ల నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఒక్కో హోదాకు ఒక్కో రేటును పెట్టింది. ఇది మొదటి విడ‌త మాత్ర‌మేన‌ట‌. రెండో విడ‌త ఎన్నిక‌ల‌కు ముందుంటుందేమో. మ‌రోవైపు ద‌ళిత బంధుకు వెయ్యి కోట్లు ఇక్క‌డే ఖ‌ర్చు చేస్తార‌ట‌. ఇవిగాక కుల సంఘాల భ‌వ‌నాలు, పెద్ద‌మ్మ‌గుడి, ఎల్ల‌మ్మ‌గుడి, కుల సంఘాల‌కు స్థ‌లాలు.. ఇలా లోక‌ల్ లీడ‌ర్ల‌కు, అక్క‌డి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఈ ఉప ఎన్నిక పండుగ‌లా మారింది. మామూలుగా ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం కేసీఆర్ అల‌విమాలిన హామీలిస్తాడు. అవి అమ‌లు కావ‌డం త‌ర్వాత ముచ్చ‌ట‌. ఆ ఎన్నిక‌ల స‌భ‌లో క‌డుపునిండా హామీలిచ్చి క‌నువిందు చేస్తాడు. ఇది ఆయ‌న‌కు అల‌వాటే. కానీ ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్‌కు ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా మారింది. ఈట‌ల గెలుపును ఆయ‌న ఎట్టి ప‌రిస్థితిలో జీర్ణించుకోలేడు. దీంతో అన్ని శ‌క్తుల‌ను అక్క‌డ మోహ‌రించాడు. అధికారాన్ని విచ్చ‌ల‌విడిగా వాడుకుంటున్నాడు. ఇంటెలిజెన్స్ టీంతో నిఘా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని కేసీఆర్‌కు చేర‌వేస్తున్న‌ది. ఆ వెంట‌నే రంగంలోకి దిగి వారిని త‌మ‌వైపున‌కు లాక్కునే క్ర‌మంలో సామాదాన బేధ దండోపాయాల‌న్నీ ప్ర‌యోగిస్తారు. ఇవ‌న్నీ ఇలా స‌మ‌యంలో …. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి తాజాగా చేసిన కామెంట్ కేసీఆర్ వైఖ‌రి ఎలా ఉందో తెలియ‌జేస్తున్న‌ది. ఎమ్మెల్యేల మ‌దిలో ముచ్చ‌ట‌ను ఆవిష్క‌రిస్తున్న‌ది. ప్ర‌జ‌ల మ‌నోగ‌తాల‌కు అద్దం ప‌డుతున్న‌ది. తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ద‌మ‌ని, త‌ద్వారా వ‌చ్చే ఉప ఎన్నిక ద్వారా నియోజ‌వ‌క‌ర్గం బాగుప‌డుతుంద‌ని అన్నాడు. హుజురాబాద్‌ను ఉదాహ‌రించాడు. అక్క‌డ కేవ‌లం ఓట్ల కోసం కేసీఆర్ ఇవ‌న్నీ చేస్తున్నాడ‌ని అంటున్నాడు. మొన్న‌టికి మొన్న ఆర్మూర్‌లో కూడా ఎమ్మార్పీఎస్ నేత‌లు త‌మ‌కు కూడా ఉప ఎన్నిక రావాల‌ని, ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి ద‌ళిత ద్రోహి అని, అత‌ను ద‌ళిత‌బంధు అమ‌లు కాకుండా చేస్తాడ‌ని ఆరోపించారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కేసీఆర్‌కు కొంత మంది నెటిజ‌న్లు నియోజ‌క‌వ‌ర్గ సంక్షేమ శాఖ మంత్రిగా కొత్త బిరుదును ఇచ్చారు.

You missed