కామారెడ్డి బరి నుంచి గులాబీ దళపతి పోటీకి దిగడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు బూస్టింగ్‌ వచ్చిందని భావించారంతా. కానీ అక్కడే అసలు సమస్యలు తిష్టవేశాయి. పార్టీ పరిస్థితి దినదినం ఇక్కడే మరింత అధ్వానంగా మారుతూ వస్తోంది. నేతల మధ్య సమన్వయం లేదు. క్యాడర్‌లో తీవ్ర అయోమయం. నిధులు వస్తూనే ఉన్నా.. ఎంత హైప్‌ పెంచాలని చూసినా.. అక్కడ పార్టీ కి అనుకున్నంత బలం రావడం లేదు. కారణం స్థానిక నేతలే. ఎమ్మెల్సీ కవితతో పాటు పలు కార్యక్రమాలు చేయాలని తొలత అధిష్టానం పిలుపునిచ్చింది. స్థానిక నేతలకు సూచనలు చేసింది. కానీ అవేవీ కానీయలేదు. ఆమెను రానీయలేదు. ఇది ఇలాగే కొనసాగుతూ వస్తోంది. లోకల్ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు, మున్సిపల్ చైర్‌ పర్సన్‌ తదితర నేతలకు ఇక్కడ పొసగడం లేదు. ఎవరికి వారే యమునా తీరే.

ముందే అక్కడ లోకల్‌ లీడర్లపై తీవ్ర వ్యతిరేకత. దానికి తోడు అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం లేకపోవడం.. మరింత గ్యాప్‌ను పెంచింది. ఏకంగా గులాబీ దళపతే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడంటే అక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉండాలె..? క్యాడర్‌లో ఎంతటి జోష్‌ నిండి ఉండాలె. కానీ అది లేకపోగా.. తీవ్ర అయోమయంలో పార్టీ క్యాడర్ కొట్టుమిట్టాడుతోంది ఇక్కడ. దీంతో అధినేత కేసీఆర్‌ ఇక్కడ పరిస్థితులపై ప్రత్యేకంగా నజర్‌ పెట్టినట్టు తెలిసింది. కవితను కలుపుకుపోని లోకల్ లీడర్లకు రామన్ననే సరైనోడు అని తేల్చాడు. కామారెడ్డి బీఆరెస్‌ పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రి కేటీఆర్‌ను రంగంలోకి దింపాడు కేసీఆర్. శనివారం కామారెడ్డి కార్యకర్తల సమావేశానికి పిలుపునిచ్చాడు కేటీఆర్. దాదాపు పదివేల మంది కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నాడు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిన పార్టీ పరిస్థితిని చక్కదిద్ది దిశానిర్దేశం చేసేందుకు నడుం బిగించాడు యువనేత.

You missed