నవమాసాలు నిండకముందే.. ఇంకా ఆ పసిగుడ్డు బయట ప్రపంచాన్ని చూడకముందే ఓ తల్లి ఆ పుట్టే చిన్నారికి బేరం కుదుర్చకున్నది. మగైతే లక్షన్నర ఇవ్వాలని, ఆడపిల్లైతే లక్ష ఇవ్వాలని ఒప్పందం కూడా చేసుకున్నది. ఇంకా ఆశ చావనట్టున్నది. ఇదే బేరం మరొకరితో కూడా చేసుకుంది. పుట్టే పిల్లనే తన బతుకు దెరువుకు, జీవనానికి పెట్టుబడిగా భావించిందా తల్లి. ఇద్దరితో బేరం కుదుర్చోవడంతో ఆ బిడ్డ నాదంటే నాదని రోడ్డెక్కి రచ్చ చేసుకునే సరికి ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ సంఘటన నిజామాబాద్‌ నగరంలోని అంబేద్కర్‌ కాలనీలో జరిగింది. పోలీసులు ఎంట్రీ అయి కేసు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వీరిందరిపై కేసులు పెట్టి రిమాండ్‌కు పంపారు. వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని మూడో టౌన్‌ పరిధిలోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన గోసంగి దేవీ (33) గర్బం దాల్చింది. పుట్టే బిడ్డను పోషించే శక్తి తనకు లేదని తన స్నేహితురాలు సలూంకే జయ అనే మహిళకు చెప్పడంతో ఆమె బిడ్డకు బేరం పెట్టింది. నగరంలోని నాగారానికి చెందిన హమీన బేగుమ్‌తో పాటు ఆటోనగర్‌కు చెందిన షబానా బేగం కూడా ఈ విషయాన్ని చెప్పడంతో వీరిద్దరు ఒప్పుకున్నారు. ఐదు వేల అడ్వాన్సు తీసుకున్నారు. మగ బిడ్డకు జన్మనివ్వడంతో వీరిద్దరూ తనకు బిడ్డ కావాలంటే తనకు కావాలని రోడ్డెక్కారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి కేసు పెట్టి అసలు విషయాన్ని గుట్టు తేల్చారు. బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లిపై, కొనుగోలు చేసేందుకు బేరమాడిన ఇద్దరిపై కేసు పెట్టి రిమాండ్‌కు పంపారు పోలీసులు.

You missed