(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్)
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
నిండా ముప్పై ఏండ్లు లేవు వాడికి. ఓ పదిహేను, ఇరవై లక్షల ఇంటి ఆస్తి కోసం ..తన ప్రాణ స్నేహితుడిని, అతని కుటుంబ సభ్యులను పదిహేను రోజుల్లోనే ఆరుగురిని మట్టుబెట్టాడు సైకో సీరియల్ కిల్లర్. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన ఈ సీరియర్ కిల్లర్ పేరు గొల్ల ప్రశాంత్. ఇళ్లకు లోన్లు ఇప్పించడం, పాట్లు భూములు అమ్మి పెట్టడం చేస్తుంటాడు. కొందరి లీడర్లతో తనకు మంచి సంబంధాలున్నాయని, వారితో దిగిన ఫోటోలను ప్రదర్శించి అక్రమాలు, డబ్బుల వసూళ్లకు దిగిన ఉదంతాలున్నాయి వీడిపై. క్రిమినల్‌కు ప్రసాద్ అనే స్నేహితుడు అదే మండల కేంద్రానికి చెందినవాడు. సీరియల్ కిల్లర్ చంపింది ఈ ప్రసాద్‌ను అతని ఇద్దరు పిల్లలు, భార్య, ఇద్దరు చెల్లెండ్లను వరుస పెట్టి.. పదిహేను రోజుల్లోనే తుద ముట్టించాడు. సైకో క్రిమినల్ సినిమాను తలదన్నే రీతిలో జరిగిన ఈ దారుణ ఘటనను ఆరు రోజుల్లోనే చాకచక్యంగా చేధించారు కామారెడ్డి పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా అధికారికంగా వివరించకున్నా.. జరిగిన, తెలిసిన వాస్తవాలు ఇలా ఉన్నాయి.
మృతుడు ప్రసాద్ మాక్లూర్ మండలానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. అప్పటికే ప్రసాద్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా. ఆ అమ్మాయిని వేధించడంతో కేసు నమోదైంది. దీంతో భయపడి గల్ప్ దేశాలకు పారిపోయాడు ప్రసాద్. అతనికి మాక్లూర్ మండల కేంద్రంలో రెండు ఇండ్లు ఉన్నాయి. దాదాపు ఇవి పదిహేను నుంచి ఇరవై లక్షల విలువ ఉంటాయి. గల్ప్ నుంచి తిరిగి వచ్చిన ప్రసాద్ .. అమ్మాయిని వేధించిన కేసులో పెద్దల పంచాయతీలో తనకు చెందిన కొంత భూమిని పరిహారంగా ఆ అమ్మాయికి రాసి ఇచ్చాడు. తనకు ఉన్న ఆ రెండు ఇండ్లు కూడా లాక్కుంటారని భయపడి అతని స్నేహితుడు, ఏ1 నిందితుడైన గొల్ల ప్రశాంత్ పేరు మీదకు మార్చాడు.లోన్ ఇప్పించమన్నాడు. అప్పటి నుంచి ప్రశాంత్‌లోని నర రూప రాక్షసుడు మేల్కొన్నాడు. ఎలాగైన వాటిని తన సొంతమే చేసుకోవాలని ప్లాన్ వేశాడు. ఆ ఊరు నుంచి అప్పటికే మాచారెడ్డి సమీపంలోని పాల్వంచ మండల కేంద్రంలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
గత నెల 28 తన టార్గెట్‌ను స్టార్ట్ చేశాడు క్రిమినల్ ప్రశాంత్. మొదట స్నేహితుడిపై గురి పెట్టాడు.డిచ్‌పల్లి దగ్గర బాగా తాగించి చంపేసి అక్కడే బొంద పెట్టేశాడు. ఆ తరువాత మరుసటి రోజు భార్య దగ్గరకు వెళ్లి పాత కేసులో ప్రసాద్‌ను పోలీసులు పట్టుకున్నారని బాసర తీసుకెళ్లి అక్కడ చంపేసి ఆమె డెడ్‌బాడీని బాసర గంగలో పడేశాడు. ఆ బాడీ దొరకలేదు.మృతురాలు ప్రస్తుతం గర్భవతి అని తెలిసింది. ఆ తరువాత ఇద్దరు చెల్లెండ్ల వంతు వరుసగా. ఒక చెల్లె మానసిక వికలాంగురాలు.మరో చెల్లె వితంతురాలు. వీరిద్దరిని ఒకరికి తెలియకుండా ఒకరిని తీసుకెళ్లి ఒకరిని సదాశివనగర్ భూంపల్లిలో చంపి కాల్చేశాడు. మరొకరిని చేగుంట దగ్గర చంపి డెడ్‌బాడీ కాల్చేశాడు. ఆ తరువాత ఇద్దరు పిల్లలను నిర్మల్ సోన్ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లి అక్కడ బ్రిడ్జిలో పడేశాడు.
ఇలా ఆరుగురుని మట్టుబెట్టిన ఈ సైకో కిల్లర్ గురించి తెలిసింది… భూంపల్లి వద్ద దొరికిన సగం కాలిన ప్రసాద్ చెల్లె మృతదేహంతోనే. చిన్నపాటి క్లూల ఆధారంగా కామారెడ్డి పోలీసులు తీగ లాగారు. డొంక కదిలింది. సైకో సీరియల్ కిల్లర్ గొల్ల ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఆరుగురిని అతి దారుణంగా చంపిన ఈ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. క్రైమ్ సినిమాను తలదన్నే రీతిలో జరిగిన ఈ దారుణ ఘటనపై అందరూ చర్చించుకుంటున్నారు.