అర్విందన్న డోంట్‌కేర్‌.. కాంగ్రెస్‌ టచ్‌లో బీజేపీ నేతలు..

పార్టీపై పట్టుకోసమే తపన… అందిరినీ కాపాడుకోవడంలో విఫలం…

కాంగ్రెస్‌ వైపు బీజేపీ నేతల చూపులు…

‘పోతే పోనీ… ఆపుతామా..?’ అంటున్న ఎంపీ అర్వింద్‌..

ఐదారు రోజుల్లో టచ్‌లో ఉన్న బీజేపీ నేతల పేర్లు వెల్లడిస్తామన్న డీసీసీ ప్రెసిడెంట్‌..

 

‘అన్నా… ఆళ్లు కాంగ్రెస్‌లకి పోతరంటనే… ‘

అర్విందన్నకు చేరవేశాడు ఓ అనుచరుడు…

గుర్రుమని ఓ చూపు చూశాడా ఎంపీ… ముఖవర్చస్సంతా ఎర్రగా మారింది. ఆ సమాచారంతో. అయినా సైలెంటుగానే ఉన్నాడు. మళ్లీ అతనే అందుకున్నాడు.. ‘ఏమైనా చేసి ఆపాల్నే..!’ ఎంపీగా తాను చేయాల్సిన బాధ్యతను కూడా అతనే చెప్పడంతో మరింత కొరకొరా చూశాడా యువ నేత. ‘ అయితే ఏం చేయమంటావ్‌..! పొయ్యేవాళ్లు పోనీ.. పొయ్యేటోళ్లను ఆపతమా..?’ అన్నడు. ఇగ ఇదే ఫైనల్‌. మళ్లీ మళ్లీ ఇసోంటి సమాచారం నాదగ్గరకు తీసుకురావొద్దు.. అన్నట్టుంది ఆ సమాధానం కటువుగా. ఆ అనుచురుడి ముఖం చిన్నబోయింది. మెల్లగా ఆ రూమ్‌లకెల్లి పక్కకొచ్చాడు. ‘ఇదేందిరా.. బై.. ఎంపీ సాబ్‌ గిట్లంటుండు.. మెల్లమెల్లగా అందర్నీ అండ్లకే సాగనంపుతడా ఏందీ..?’ అన్నడు ఇంకో కమలనాథుడితో. అతని ఫేసులో క్వశ్చన్‌మార్క్‌ కనిపించింది. ఇక ఆన్సర్‌ కోసం చూడటం వేస్ట్‌ అనుకొని వెనుదిగాడతను.

ఇప్పుడు నిజామాబాద్‌ జిల్లాలోని బీజేపీ పార్టీ పరిస్థితికి ఇది అద్దం పుడుతున్నది. ఒకప్పుడు బీజేపీ మంచి ఊపుమీదున్నది. బీఆరెస్‌తో నువ్వా నేనా అనే రేంజ్‌లో తలపడ్డది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ మంచిగనే గెలిచింది. దీంతో అర్వింద్‌కు ఎదురేలేకుండా పోయింది. సహజంగానే అహంకారి అయిన అర్వింద్‌కు ఇది మరింత గర్వం తెచ్చిపెట్టిందంటారు ఆ పార్టీ నేతలు. దీనికి తోడు తన ప్రత్యర్థి వర్గమని రెండు గీతలు గీసి వారిని వేరు చేసి చూశాడు. దీంతో అసమ్మతి పెరిగిపోయింది. దిక్కులేక మొన్నటి వరకు బండి సంజయ్‌ పంచన చేశారు. బండి సంజయ్‌ పోస్ట్‌ ఊస్టింగ్‌ కాగానే దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ ఫలితాలతో ఒక్కసారిగా టాక్‌ మారింది. గాలి కాంగ్రెస్‌కు అనుకూలంగా వీచడం మొదలయ్యింది. దీంతో జిల్లాలోని బీజేపీ శ్రేణులు, అసంతృప్త కాషాయనేతలంతా కాంగ్రెస్‌ పంచన చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి డిక్లేర్‌ చేశారు. జిల్లాలో చాలా మంది బీజేపీ నేతలు తమకు టచ్‌లో ఉన్నారని ఐదారు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన వాస్తవం ప్రతినిధితో చెప్పడం విశేషం.

 

 

You missed