ఆర్మూరా…. మజాకా..?

సెక్యూరిటీ మధ్య బీజేపీ నేత రాకేశ్‌రెడ్డి…

రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం.. ఆర్మూర్‌ పాలిటిక్స్‌…

ఆర్మూర్‌ చిన్న నియోజకవర్గం. కానీ ఇక్కడి రాజకీయాలే వేరు. అధికార పార్టీ అంటే ప్రతిపక్షాలకు హడలు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అంటే దడ. నాతో పెట్టుకోకు అనే రేంజ్‌లో ఆయన ప్రతిపక్షాలపై వ్యవహరించేలా తీరుంటుంది. కొన్ని సందర్బాల్లో బాహాటంగానే బెదిరింపులుంటాయి. హెచ్చరికలుంటాయి. అలాంటిది మరోసారి జీవన్‌రెడ్డి ఆర్మూర్‌ బరి నుంచి పోటీలో నిలిచేందుకు రెడీ అయ్యాడు. ముచ్చటగా మూడోసారి గెలిస్తే మంత్రి చాన్స్‌ నాకే అని కూడా ప్రచారం చేసుకుంటున్నాడు. సరే, ఇదంతా ఒకవైపు. మరోవైపు ఇక్కడ మొన్నటి వరకు ప్రతిపక్షం లేదు. కాంగ్రెస్‌ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థే దిక్కు లేడు.

బీజేపీ నుంచి వినయ్‌రెడ్డి నేనే పోటీ చేస్తున్నా అని ఆశలు పెట్టుకున్నా.. అర్వింద్‌.. బీజేపీ అధిష్టానం మొన్న అంకాపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త రాకేశ్‌రెడ్డిని బరిలోకి దింపింది. దాదాపుగా తనే ఆర్మూర్ నుంచి పోటీ చేస్తున్నట్టుగా పార్టీ అధిష్టానం పరోక్ష సిగ్నల్స్‌ కూడా ఇచ్చింది. ఆ రేంజ్‌లోనే ఆర్మూర్ నియోజకవర్గానికి భారీ ర్యాలీతో వచ్చాడు రాకేశ్‌రెడ్డి. ఆర్మూర్‌ చౌరస్తాలో జీవన్‌రెడ్డికి సవాల్‌ విసిరి రాజకీయంగా యుద్దానికి రెడీ అయ్యాడు. మొన్న నందిపేట్‌కు చెందిన కొందరిని పార్టీలోకి తీసుకున్నారు. రాజకీయం ఇక్కడ రంజుగా మారింది. ఎక్కడా ఏ నియోజకవర్గంలో ఇంకా టికెట్లే కన్ఫాం కానీ పక్షంలో.. పెద్దగా ఎన్నికల వాతవారణం వేడెక్కినట్టు కనిపించకపోయినా.. ఆర్మూర్‌లో మాత్రం బీఆరెస్‌, బీజేపీ జోరు నడుస్తుంది. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసివనే కానీ.. అందరూ గమనించని ఓ కొత్త విషయమొకటుంది.

అదేంటంటే.. రాకేశ్‌ రెడ్డి నేషనల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ను నియమించుకున్నాడు. ఓ నలుగురు సాయుధ సెక్యూరిటీ నల్లటి యూనిఫాంలో అతని వెంటే తిరుగాడుతారు. డేగ కన్నుతో అతన్నే ఫాలో అవుతారు. వీరే కాక మరో నలుగురు ప్రైవేటు సైన్యాన్ని కూడా రాకేశ్‌రెడ్డి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటారా..? ఇంకా అర్థం కాలేదా..? ఆర్మూరా మజాకా..? జీవన్‌రెడ్డితో ఢీ కొట్టడమంటే అంత వీజీ అనుకుంటున్నారా..? ఓట్లు ఊరికే రావు… ఎన్నికల్లో నిలబడాలంటే … అదీ ఆర్మూర్‌లో అయితే .. అంతే.

You missed