షకీల్‌కు ఎంఐఎం షాక్..
రాజకీయ చర్చకు తెరలేపిన పట్టణ ప్రగతి బహిష్కరణ…
కారును అడ్డగించి వ్యతిరేక నినాదాలు …
బీఆరెస్‌కు ఎంఐఎంకు మధ్య పెరుగుతున్న దూరం….
బోధన్- వాస్తవం ప్రతినిధి:
ఎంఐఎం కౌన్సిలర్లు బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు షాకిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండి ఎంఐఎం బలంగా ఉన్న వార్డులను అసలు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే కోపంతో ఉన్న ఆ పార్టీ కౌన్సిలర్లు శుక్రవారం జరిగిన పట్టణ ప్రగతిని బహిష్కరించారు. ఆర్డీవో, కమిషనర్‌ను నిలదీశారు. అభివృద్ధి కేవలం కొన్ని వార్డులకే పరిమితం చేస్తారా..? మా కాలనీలు వార్డులు కావా..? మేం మనుషులం కాదా.. ?? అంటూ నిలదీశారు. ముస్లిం మైనార్టీలున్న ఈ వార్డులకు పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే పాల్గొనాల్సింది. కానీ ఆయన కావాలని ఈ ప్రోగ్రాం కాకుండా మరో దానికి వెళ్లాడు. దీంతో చూసీ చూసీ విసిగి పోయిన ఎంఐఎం కౌన్సిలర్లు అధికారులను నిలదీసి…పట్టణ ప్రగతిని బహిష్కరించారు. ఆ తర్వాత సాయంత్రం కూడా ఓ ప్రోగ్రాం కు అటెండయిన ఎమ్మెల్యే కారును ఎంఐఎం కార్యకర్తలు, నాయకులు అడ్డగించి నినాదాలు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. చాలా రోజులుగా ఇక్కడ షకీల్ వైఖరితో ఎంఐఎం నేతలు విసిగిపోయి ఉన్నారు.ఈ రెండు పార్టీల మధ్య చాలా గ్యాప్ వచ్చింది.
అది రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ మధ్య ఓ 14 వార్డుల అభివృద్ధి కోసం షకీల్ ప్రత్యేకంగా నిధులు కేటాయించాడు. కానీ అందులో ఒక్కంటే ఒక్క ఎంఐఎం కౌన్సిలర్ ఉన్న వార్డు లేదు. దీంతో వారి కోసం నశాలానికి అంటింది. మరింత మంటతో ఉన్నారు. ఇలా సమయం రాగానే నిరసనలు తెలుపుతున్నారు. పట్టణ ప్రగతి అని గొప్పగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు…. మా దగ్గర ప్రగతి ఏదీ.. అభివృద్ధి ఏదీ..?? అంటూ ఏకంగా కార్యక్రమాన్నే బహిష్కరించడం అక్కడ రాజకీయ చర్చకు తెరలేపింది. ఎమ్మెల్యే వ్యవహార శైలి అందరిని కలుపుకుని పోకుండా లేకపోవడంతో కొత్త వివాదాలు వచ్చి పడుతున్నారు. బీఆరెస్‌కు ఎంఐఎంకు ఇప్పుడు అక్కడ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇదెటు దారి తీస్తుందో..?