తిక్క కుదిరిందా..?
కాళ్ల బేరానికి వచ్చిన వీసీ… ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన వీసీ రవీందర్ గుప్తా
తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా యాదగిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ…
ఏసీబీ, విజిలెన్స్ దాడులతో వీసీ మెడకు బిగుసుకున్న ఉచ్చు…. తప్పించుకునే వ్యూహంలో ఈసీని దారిలోకి తెచ్చుకునే యత్నం…
పరువు తీసి.. కాళ్లుపట్టుకుంటే ఏం ప్రయోజనం..? వీసీపై సీరియస్‌గానే సర్కార్…
తెలంగాణ యూనివర్సిటీ విచిత్ర వింత సంఘటనలకు ఆద్యుడై ఆజ్యం పోసి ఆగమాగం చేసిన వీసి మొత్తానికి కాళ్ల బేరానికి వచ్చాడు. కాదు… కాదు వచ్చేలా చేసింది సర్కార్. తన ఇష్టారాజ్యంగా రిజిస్ట్రార్‌లను నియమించుకుంటూ అక్రమాలకు, అవినీతికి ఆలవాలంగా వర్సిటీని మార్చి పరువును గంగలో కలిపిన రవీందర్ గుప్తా మెడలు వంచింది సర్కార్. ఎమ్మెల్సీ కవిత ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈసీ సభ్యులతో, విద్యార్థి సంఘం నాయకులతో ఆమె సమావేశమై కూలకశలంగా వర్సిటీలో జరుగుతున్న రచ్చ… వీసీ ఆగడాలను స్వయంగా తెలుసుకుని రంగంలోకి దిగారు. ఆ వెంటనే ఏసీబీ, విజిలెన్స్ దాడులు మొదలయ్యాయి. అవినీతి పుట్టను తవ్వడం మొదలు పెట్టారు.
వీసీ అవినీతి పుట్టలోని పాములన్నింటినీ బయటకు తీశారు. దాడుల నేపథ్యలో కారులో కీలక ఫైళ్లతో పరారైన వీసీని సినీ ఫక్కీలో వెంబడించి మరీ పట్టుకున్న విషయం తెలిసింది. తన మెడకు ఉచ్చు బిగుసుకుంటుందని భావించిన వీసీ… ఎట్టకేలకు ఈసీ నిర్ణయాలకు కట్టుబడతానని కాళ్ల బేరానికి వచ్చాడు. రిజిస్ట్రార్‌గా యాదగిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఇక తనను క్షమించి వదిలేయండి మహాప్రభో..! అనే రీతిలో వేడుకునే దోరణిలో నేలకరిచినా.. సర్కార్ మాత్రం వీసీని వదిలేలా లేదు. ఆరు నెలల పాటు యాదగిరి రిజిస్ట్రార్‌గా కొనసాగనున్నారు.