అక్క లేక అనాథలయ్యాం…

కవితమ్మ ఓడిన నాటి నుంచి మమ్మల్ని పట్టించుకున్న దిక్కులేదు..

ఎంపీగా గెలిచి అర్వింద్‌ ఇప్పటి వరకు ఒక్కపైసా బోధన్‌కు ఇవ్వలేదు…

కవితమ్మను ఓడగొట్టుకున్న తర్వాత దరిద్రం పట్టుకున్నది..

ఎంపీగా ఆమె ఉన్నప్పుడు.. కవిత చేసినంత అభివృద్ది దేశంలోనే ఎవ్వరూ చేయలేదు…

– ఎడపల్లి ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో మనోవేదనకు లోనైన బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఆమేర్‌..

కవితక్క ఎంపీగా ఓడిన నాటి నుంచి నేటి వరకు తాము, తమ నియోజకవర్గ ప్రజలకు అనాథలైపోయాయమని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఆమేర్‌ ఆవేదనకు లోనయ్యారు. గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో ఊరూరా చెరువుల పండుగ దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా షకీల్‌ మాట్లాడుతూ.. ఎంపీగా కవితక్కను ఓడగొట్టుకున్న తర్వాత తమకు దరిద్రం పట్టుకున్నదని, తమ నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్న నాథుడు లేడన్నారు. ఎంపీగా అర్వింద్‌ గెలిచిన తర్వాత ఒక్క పైసా కూడా నియోజకవర్గ అభివృద్దికి కేటాయించలేదన్నారు. కవితమ్మ ఎంపీగా ఉన్నప్పుడు తను ఇక్కడి నియోజకవర్గ కోడలిగా ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేశారని, కాలుకు బలపం కట్టుకుని తిరిగినట్టుగా వందలాది కిలో మీటర్ల మేర పల్లె పల్లెను చుట్టి వచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కవితక్కన ఓడగొట్టుకుని చాలా నష్టపోయామని, ఇక నష్టపోయింది చాలని, ఇకపై అలాంటి పొరపాట్లు చచ్చినా చేయబోమని మంచి గుణపాఠం వచ్చి కనువిప్పు కలిగిందని ఆయన ప్రజల పక్షాన తను అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ ఇంటి తలుపు తట్టినా కచ్చితంగా ఆ ఇంట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికైనా ఒకరికి అందుతున్నాయని, కావాలంటే ప్రతీ దర్వాజా కొట్టి చూడండి… అలా పథకాలు అందకపోతే రాజీనామా చేస్తానని ఆయన ప్రతిపక్షాలక సవాల్‌ విసిరారు.

మహారాష్ట్ర రోడ్ల మీద తిరిగి నెలరోజులు బీమారైన…

తనకు కేసీఆర్‌ బీఆరెస్ విస్తరణలో భాగంగా మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించారని, అక్కడి రోడ్ల మీద ప్రయాణం చేయడం వల్ల నెల రోజుల పాటు వెన్నునొప్పితో బాధపడి బీమారి పడ్డానని అన్నారు. అక్కడ రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయన్నారు. ఇక రైతుల బాధలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వారి కంటి వెంట కన్నీరు రావడం లేదని రక్త కన్నీరు వస్తున్నదని అన్నారు.

షకీల్‌ కోసం సతి తపన…

బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ తను ప్రసంగిస్తున్న సమయంలో గొంతు తడారిపోయింది. అప్పటికే ఎండ తీవ్రంగా ఉంది. ఆ ఎండలో కట్టమైసమ్మ వద్దకు ర్యాలీగా వెళ్లి పూజలు చేసి రావడంతో గొంతు ఎండిపోయింది. తీరా మాట్లాడే సమయానికి గొంతు సహకరించలేదు. మాటలు స్పష్టంగా రాక తడబడుతున్నాయి. దీంతో స్టేజీ మీదనే ముందు వరుసలో కూర్చుని ఉన్న ఆమె సతీమణి ఆయేషా ఫాతిమా కింద కూర్చున్న కార్యకర్తలకు ఆయనకు కొన్ని మంచినీళ్లవ్వండని చేతితో సైగ చేయడం కనిపించింది. కానీ అదెవ్వరూ పెద్దగా గమనించలేదు. వెంటనే షకీల్‌ వెనుక నిలుచున్న సెక్యూరిటిని అలర్ట్ చేద్దామని వెనక్కి తిరిగి కంటితోనే సైగ చేయాలనుకుంది. కానీ అతను ఆమె దిక్కుగా చూడటం లేదు. ముందు, వెనుకా రెండు వైపులా ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోవడంతో ఆమె ముఖం దీనంగా పెట్టుకుని కూర్చుంది. ప్రసంగం పూర్తయిన తర్వాత పక్కనే ఉన్న జడ్పీ చైర్మన్‌ షకీల్‌కు నీళ్ల బాటిల్‌ అందించాడు.

You missed