అప్పట్లో ఆయన మంత్రి. కానీ తన సొంతూరుకి పట్టుమని పది పింఛన్లు కూడా ఇప్పించుకోలోని అసమర్థుడాయన… అని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డిని ఉద్దేశించి సంచలన కామెంట్స్‌ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఎడపల్లిలో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కాంగ్రెస్‌ నాయకులను టార్గెట్ చేశారు. తనదైన శైలిలో ఉతికారేశారు. మంత్రి హోదాలో ఉండి కూడా కొత్త పింఛన్లు ఇప్పించలేకపోయాడని మాజీ మంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూనే… ఎవరైనా చస్తే గానీ కొత్త పింఛన్లు రావనే దుస్థితి ఆనాటి కాంగ్రెస్‌ పాలనలో ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు దరఖాస్తు చేసుకుంటే చాలు పింఛన్లు ఇస్తున్నామన్నారు.

బీడీ కార్మికుల సంక్షేమం కోసం కటాఫ్‌ డేట్‌ను కూడా ఎత్తేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పింఛన్‌ సదుపాయం కల్పించామన్నారు. ఇంకా దరఖాస్తులు వస్తున్నాయని, అవన్నీ చేస్తామన్నారు. ఏ ఇంటి దర్వాజా కొట్టి మీకు ఏమైనా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా అని అడిగితే అవును అనే సమాధానం వస్తుందని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేత మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కు ఏదో పదవి ఇచ్చారని నోరు ఎడాపెడా పాడేసుకుంటున్నారని, సంబురాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారని .. ప్రజలకు ఇంత మంచి పాలన అందించి పథకాల ద్వారా వారి జీవన ప్రమాణాలు, జీవితాలు మార్చాం కనుకే పండుగ చేసుకుంటున్నమని స్పష్టం చేశారు. గంగా జమునా తహజీబ్‌లా తెలంగాణలో అన్ని కులాల, మతాల సంస్కృతి, సంప్రదాయాల కలబోత ఉందని,అదే ఉద్యమానికి ఊపిరిలూది సబ్బండవర్ణాలను ఏకం చేసి స్వరాష్ట్రం సాధించిపెట్టిందన్నారు.

అదే విధమైన పాలనను కేసీఆర్‌ కొనసాగిస్తూ అందరి ఇంటా సంక్షేమం ఉండేలా పథకాలు రూపొందిస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఏటా 600 కోట్లు ఖర్చు చేసేదని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు కేటాయిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇక్కడి మిషన కాకతీయ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టి అమృత్‌ సరోవర్‌ అని పేరు పెట్టి ప్రచారానికే వాడుకుంటుందని కానీ, అసలైన ఫలాలు అందించడంలో అది విఫలమైందన్నారు. ఆనాడు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వి చెరువులు ఎండిపోకుండా చూశారని, కానీ కాలక్రమేణా గొలుసు కట్టు చెరువులు కబ్జాకు గురై చాలా చెరువులు ఎండిపోయాయన్నారు. కాకతీయుల మాదరిగానే ఆలోచించిన కేసీఆర్‌ కాళేశ్వరం, నిజాంసాగర్‌, ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకాల ద్వారా అన్ని చెరువులు నిండు కుండలా ఉండేలా, ఎప్పుడూ నీటితో కళకళలాడేలా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 47వేల చెరువులు పునరుద్దరణ కోసం 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని గుర్తు చేశారు.

You missed