మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో జిల్లాకు ఎవరికీ కేటాయించలేదు. మళ్లీ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. శనివారంతో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న రాజేశ్వర్‌ పదవీకాలం ముగిసింది. మొన్న జరిగిన కేబినేట్‌ భేటిలోనే ఈ గవర్నర్‌ కోటాలో ఖాళీ కానున్న రెండు సీట్లకు పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు పంపాల్సింది. అలాగే జరగుతుందని అంతా అనుకున్నారు. కానీ దీని ఊసే ఎత్తలేదు కేసీఆర్‌. తీరా ఆ గడువు ముగిసినా కూడా ఇంకా పేర్లపై క్లారిటీ రాలేదు. అయితే ఇది జిల్లా నుంచి ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానం కావడంతో ఇది తమకే కేటాయిస్తారని భావిస్తున్నారు ఆ పార్టీ ఆశావహులు.

చాలా కాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్న వాళ్లున్నారు. ఎన్నికల సమయం సమీపించింది. ఇక మళ్లీ పదవుల గురించి ఇప్పట్లో ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. దీంతో ఈసారి ఎమ్మెల్సీని ఎలాగైనా వదిలేదు అనే రీతిలో ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఇటీవలే వీజీ గౌడ్‌ సీటు ఖాళీ అయ్యింది. ఆయనకు మళ్లీ రెన్యూవల్ చేస్తారని అనుకున్నారు. కానీ చేయలేదు. వేరొకరికైనా జిల్లా నుంచి ఎంపిక చేసుకుంటారేమోనని భావించారు. అదీ జరగలేదు. దీంతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని జిల్లా కోల్పోయిందనే భావనలో ఉన్న నేతలకు … ఇప్పుడు ఖాళీ అయిన గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీయైనా మళ్లీ జిల్లాకు కేటాయిస్తారని గట్టిగా నమ్మకం ఉండే. కానీ అదంతా ఉత్తదేనని తేలిపోయింది.

ఈ సారి కూడా జిల్లాకు ఇది దక్కేలా లేదు. పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. ఇప్పటికే పేర్లు డిసైడ్‌ కావాల్సింది. కాలేదు. మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనలో ఉన్నారని, 30న వస్తాయని ఆ తర్వాత మంత్రుల సంతకాలతో సర్క్యూలర్‌ జారీ చేస్తారని కూడా అనుకుంటున్నారు. కానీ అలా చేసినా జిల్లాకు మాత్రం అవి దక్కే అవకాశాలు మచ్చుకైనా కనిపించడం లేదు. తనకు మళ్లీ రెన్యూవల్ చేయలేదని వీజీగౌడ్ ఎంతో ఆశాభావంతో ఉన్నారు. తనకు కూడా గతంలో హామీ ఇచ్చి మరిచారని ప్రస్తుత ఉమెన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్ పర్సన్‌ ఆకుల లలిత కూడా పార్టీ పెద్దలకు గుర్తు చేస్తూ వెళ్తున్నారు. మధుశేఖర్‌ కూడా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిపై గంపెడాశలు పెట్టుకున్నారు.

మళ్లీ తనకే రెన్యూవల్‌ చేయాలని రాజేశ్వర్‌ కూడా మంత్రి చుట్టే తిరుగుతున్నారు. కానీ జిల్లా నేతలెవరికీ ఈ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అసలు కేసీఆర్‌కు ఈ సీట్లపై ఇంట్రస్ట్‌ ఉందా ..? అని కొందరు డౌట్‌ పడుతుండగా… వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఏవైనా రెండు పేర్లు గవర్నర్‌కు పంపుతారని కొందరు అనుకుంటున్నారు. కానీ కేసీఆర్‌ మాత్రం బిజీబిజీగా ఉన్నారు. జూన్‌ 2 నుంచి దాదాపు 21 రోజులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలిచ్చారు. అంటే దాదాపు నెల రోజుల పాటు ఇదే బిజీ కొనసాగనుంది. ఇక దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునేంత టైమ్‌, ఇంట్రస్ట్ కేసీఆర్‌కు లేనట్టేననిపిస్తోంది.మరోవైపు త్వరలో బిల్లుల ఆమోదం కోసం ఒక రోజు అసెంబ్లీని కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు. దీని కోసం కేబినేట్‌ పెట్టే అవకాశం లేకపోలేదు. దాంట్లోనైనా కనీసం ఈ ఉత్కంఠకు తెరపడుతుందా..? అని కూడా ఎదురుచూస్తున్నారు.

You missed