గోవన్న హితబోధ..
ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మావలోకనం…

బీఆరెస్‌ కార్యకర్తలు,నాయకుల అలసత్వంపై బాజిరెడ్డి మార్క్‌ క్లాస్‌

రూరల్ మండల ఆత్మీయసమ్మేళనం వేదికగా తీరు మార్చుకోవాలని హితవు…

మార్పు లేకపోతే పదవులు పోతాయ్‌ అని వార్నింగ్‌…..

మొద్దునిద్ర వీడేలా… వెన్నుతట్టి ప్రోత్సహించేలా గోవర్దన్‌ స్పీచ్‌…

నిజామాబాద్‌ ప్రతినిధి- వాస్తవం:

ఆయనంతే. ముక్కుసూటితనం, ఆ ధైర్యమే ఓ వ్యక్తిత్వాన్ని ఏర్పర్చింది. గోవన్న అని అంతా ముద్దుగా పిలుచుకునే బాజిరెడ్డి గోవర్దన్‌ బుధవారం జరిగిన రూరల్‌ మండల ఆత్మీయ సమ్మేళనం మీటింగులో తనదైన శైలిలో హితబోధ చేశారు. నిజానికి ఆయన స్పీచ్‌ ఏ వేదిక మీదైనా కాస్త భిన్నంగా ఉంటుంది. రొటీన్‌ రొడ్డకొట్టుడు స్పీచ్ ఉండదు. మనతో ముచ్చట పెట్టినట్టుగా, బుద్దిగా ఉండమని సుకుమారమైన హెచ్చరికలా, శృతిమించిపోతున్న ఆగడాలపై అగ్గి బరాటాలా.. అలా సమయం, సందర్భం తగ్గట్టుగా ఆయన స్పీచ్‌ కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇది కొంచెం భిన్నం. అంటే తన వైఖరికి కాదు. తమ లోపాలనెత్తి చూపుకుని మున్ముందు పొరపాట్లు జరగకుండా ఉండేలా ఓ మాటల చికిత్స. హితబోధ టానిక్‌. అలసత్వం వీడకపోతే పదువులు ఊడతాయ్‌ రా బాబు అనే గట్టి డోస్‌ వార్నింగ్‌ కూడా చివరకు. ఇదీ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో బాజిరెడ్డి స్పీచ్‌ సారాంశం స్థూలంగా. ఇది ఆత్మీయ సమ్మేళనంలా లేదు. ఆత్మవలోకనంలా ఉంది. ఏదో సమ్మేళనాలు పెట్టుకున్నాం కదా.. భోజనాలు చేశాం కదా..! అనే రీతిలో పట్టించుకోకుండా ఉంటే రేపు జరగబోయే నష్టాన్ని అంచనా వేసి ముందే మేల్కొల్పే ఓ షుగర్‌ కోటెడ్ చేదు గుళికలా ఉంది.

గోవన్న అంతేలే కోపడతాడు.. మళ్లీ దగ్గరికి తీస్తాడు… ఆయనది ప్రేమ గుణం కదా.. అంతే.. అని అనుకునే వారికీ ఓ వార్నింగ్ వెళ్లింది పరోక్షంగా. ఇక ఇలాగే చూస్తే అంతా మునుగుతాం. తేరుకుంటే తేలుతాం అని. ఎంతగా ఈ వేదికగా ఆయన తన కార్యకర్తలకు, నాయకులకు హితబోధ, సందేశం చేశారంటే… కొంత మంది యువకులు పుట్టుకతో వృద్దులు అని శ్రీ శ్రీ చెప్పిన గేయాన్ని గుర్తు చేసేంతగా. తామే నయం అంటూ కొంత మంది వృద్దలు పుట్టకతో యువకులు అని కూడా దీన్ని తమకు అనుకూలంగా అన్వయించుకున్నారు. పనిలో పనిగా వీజీ గౌడ్ ఉదంతాన్ని తీసుకున్నాడు. ఆయనకు ఇన్చార్జిగా ఇచ్చిన జిల్లాలో ఎలా సమ్మేళనాలు నిర్వహిస్తున్నాడో చూడండని ఓ ఉదాహరణ కూడా వారి కళ్లముందుంచాడు. తను ఎలా ఎదిగి వచ్చాడో కూడా యాదికి తెచ్చాడు. రాజకీయంగా ఒకేసారి ఉన్నత పదువులు రావు.. కష్టపడాలి.. అదెలా ఉండాలంటే ప్రజలు మనల్ని బతికించుకునేలా… ఎక్కడ నుంచి పోటీ చేసినా విజయం ముద్దాడేలా చేసేలా.. అని తన జీవిత పాఠాన్ని సూక్ష్మంగా కనువిప్పు కలిగేలా వివరించాడు.

గోడలకు వాల్‌ పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పెయింటింగులు వేసిన సందర్బాల నుంచి.. సర్పంచ్‌గా, మండలాధ్యక్షుడిగా.. ఎమ్మెల్యేగా నాలుగు పర్యాయాల ప్రస్థానం దాకా చెప్పుకొచ్చి.. ఇలా మీరెందుకుండరు అని నిలదీశారు. ఉండాలి.. ఉంటేనే భవిష్యత్తని హితబోధ చేశాడు. మొండికి తెగించాం.. నక్సలైట్ల నుంచి ప్రాణాపాయం ఉన్నా ప్రజా సేవలో ప్రాణాలు పణంగా పెట్టిన సందర్భాలు ఈ సందర్భంగా ముందుకు తెచ్చాడు. మొత్తానికి గోవన్న స్పీచ్ ఓ సుతిమెత్తటి వార్నింగ్‌. ఓ మేల్కొల్పు చర్నాకోలా.

You missed