అగ్ర హీరోల వారసులుగా తెరంగేట్రం చేసి.. ప్రేక్షకులకు నచ్చినా నచ్చకపోయినా.. వరుస ఫ్లాపులు పలకరించినా పట్టు వీడని విక్రమార్కడిలా సినిమాల మీద సినిమాలు తీస్తూనే ఉంటారు. చాలా మంది అగ్ర హీరోల వారసులుగా వచ్చి వరుస అపజయాలు చోటు చేసుకుంటూనే ఉన్నారు. కానీ కొందరే తమ గురించి లేటుగానైనా తెలుసుకుని నేల మీదకు దిగి వస్తున్నారు. అందులో సాయి ధరమ్‌ తేజ్‌ ఒక్కడు. విరూపాక్ష సినిమా ఎంపిక చేసుకోవడమే అతనిలో వచ్చిన మార్పుకు సంకేతం. అసలు ఈ సినిమాలో హీరో కథే. హారర్‌తో హడలెత్తించి ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించడంలో కథ, డైరెక్షన్‌ ఉపయోగపడ్డాయి.

కథ విషయానికొస్తే పక్కా పాత చింతకాయ పచ్చడి తాంత్రిక విద్యల, మంత్ర తంత్రాల, భయానక దృశ్యాల కథే. ఓ రకంగా చెప్పాలంటే పక్కా మూఢనమ్మకాలను పెంచి పోషించే సినిమా. లాజిక్‌ లేదు. మ్యూజిక్‌ లేదు. డ్యాన్సులు లేవు. పాటలు లేవు. ఫైటులూ లేవు. అంతా గ్రాఫిక్స్‌, విజువల్స్‌ భయానకం. అంతే అలా చూస్తూ ఉంటారు కుర్చీలకు అతుక్కపోయి. సరే, సినిమా విషయం.. కథ విషయం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చర్చించేది సాయి ధరమ్‌తేజ్‌ గురించి. మనిషి బాగా లావయ్యాడు. చిరంజీవి పేరు చెప్పుకుని ఇంకా ఎన్నో సినిమాలు తీయలేనని తత్వం బోధపడినట్టుంది. అందుకే ఈ కథ ఎంచుకున్నాడు. నిర్ణయం మెచ్చుకోదగిందే.

ఈ పంథాలోనే మిగిలిన ఫెయిల్యూర్‌ వారసులు నడిస్తే ఇంకొన్నాళ్లు తెరమీద చూడొచ్చు. మంచు బ్రదర్స్‌, అక్కినేని బ్రదర్స్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌… ఇంకా చాలా మందే ఉన్నారు. అవే మూస కథలు. అవే హీరోయిజం పాత్రలు. ఐదు ఫైట్లు , ఆరు పాటలు.. ఓ ఐటెం సాంగ్‌.. ఇదే తెలుగు సినిమా కథలా మారిపోయింది. ఆ చట్రంలోనే ఇరుక్కుపోయి.. కనుమరుగయ్యే పరిస్థితికొచ్చారు. ప్రయోగాలు నచ్చవు. భయం. కాలం మారుతున్న కొద్దీ.. ప్రేక్షకుల టేస్ట్ తెలుసుకుని దాని తగ్గట్టు తమను తాము మలుచుకోవాల్సిందే. మారాల్సిందే. లేకపోతే వరుస డిజాస్టర్లే ఖాతాలో చేరుతాయి.

You missed