అక్కినేని వారసత్వంలో ఒక్క నాగార్జునే ఎక్కువ కాలం హీరోగా మన గలిగినట్టు లెక్క. నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్‌ ఇద్దరు ఫెయిల్యూర్‌ హీరోలుగానే మిగిలిపోతారనిపిస్తుంది. ఈ లెక్కన నాగ చైతన్య అఖిల్‌ కొంచెం బెటరేమో నటనలో. అఖిల్‌ మరీ అధ్వానం. తొలి సినిమా అఖిల్‌ నుంచి వరుసగా సినిమాలు వచ్చీ పోయాయి అంతే. ఏవీ ఆడలేదు. నిలవలేదు. నిలబడలేదు. ప్రేక్షకులకు కనెక్టూ కాలేదు. తాజాగా ఆ లిస్టులో ఏజెంట్‌ కూడా. తొలి సినిమానే మంచి క్రియేటివిటీ డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ డైరెక్ట్ చేశాడు. కానీ ఆడలేదు. కథ అలా ఉంది. అక్కడి నుంచి కథల ఎంపికలో ఏదో తేడా కొడుతూనే ఉంది.

దీనికి తోడు అఖిల్‌ నటన కూడా. ఆ ముఖ వర్చస్సు ,హావభావాలు.. మిల్క్‌ బాయ్‌లాగే ఉన్నాయి. అందుకే లవర్ బాయ్‌గా ట్రై చేశాడు. కానీ మెచ్చుకునే రీతిలో నటన లేదు. ఎవరికీ కనెక్టు కాలేదు. ఇలాగైతే లాభం లేదనుకున్నాడేమో.. మాంచి యాక్షన్‌ కథను ఎంచుకున్నాడు. ఏజెంటుగా కండలు తిరిగిన బాడీని ప్రదర్శిస్తేనైనా ప్రేక్షకులు అబ్బురపడి ఇష్టపడతారనుకున్నట్టున్నాడు. ఎన్ని కండలు తిరిగితే ఏం లాభం.. ఎంత గడ్డం పెంచి రఫ్‌గా కనిపించాలని తాపత్రయ పడ్డా.. ఆ ముఖంలో పసితనం ఛాయలు కొట్టిచ్చినట్టు కనిపించాయి. అదే పెద్ద మైనస్‌గా నిలిచాయి అఖిల్‌ కెరీర్‌కు. ఇక తన సినీ కెరీర్‌ ఇక మున్ముందు కష్టాల కడిలేనని తేల్చింది ఏజెంట్‌. కథ విషయానికొస్తే.

పాత చింతకాయ పచ్చడి కథే. చిన్ననాడు జరిగిన సంఘటన ఓ బాలుడిని రా ఏజెంటుగా మార్చుతుంది. మమ్ముట్టి రా చీఫ్‌. అతన్ని ఆరాధిస్తూ.. రోల్‌ మోడల్‌గా తీసుకుని ఏజెంటు అవతారమెత్తుతాడు అఖిల్‌. తన వద్ద ఇలాగే ఏజెంటుగా తయారయిన విలన్‌ .. మమ్ముట్టిపై ప్రతీకారం పెంచుకుని సిండికేట్‌ మాఫియాకు డాన్‌గా మారుతాడు. అతన్ని తుదుముట్టించేందుకు మమ్ముట్టికి, మెయిన్‌ విలన్‌కు మధ్య ఎత్తుకు పై ఎత్తులతో కూడిన యాక్షన్‌ పార్ట్‌. ఒకానొక సందర్బంలో వైల్డ్‌ ఏజెంటుగా పిలుపించుకుని మమ్ముట్టి నజర్‌లో పడ్డ అఖిల్‌ను సీక్రెట్‌ ఏజెంట్‌గా నియమించి విలన్‌ను తుద ముట్టించడం… దేశాన్ని కాపాడే సీన్లతో కథ ముగుస్తుంది. కథ ఎక్కడో చూసినట్టుగానే ఉంటుంది.

భారీ యాక్షన్‌ సీన్లు, అఖిల్ కండల ప్రదర్శన.. దీపావళి ధమాకాలా పటాకుల మోతను తలపించే గన్‌ ఫైట్స్‌.. భారీ సీన్లు.. హాలీవుడ్‌ రేంజ్‌లో స్క్రీన్‌ ప్లే.. కొంచెం ఆసక్తి, టెన్షన్‌ తెప్పిస్తుంది. కానీ అన్నింటికన్నా పే..ద్ద లోపం హీరోనే. అదే అఖిల్‌. కథ మరో లోపం. హీరోయిన్‌ పాత్ర, రోమాన్స్‌ లేకపోవడం మరోలోపం. పాటలు పంటి కింద రాళ్లలా వచ్చి పోవడం… మొత్తానికి అఖిల్‌ సినీ కెరీర్‌లో మరో డిజాస్టర్. కథలో ఎంపికలో మరీ హీరోయిజం చూపేవి కాకుండా భిన్నమైనవి ఎంచుకుంటే బెటరేమో..!

You missed