దిల్‌ రాజు. కింది స్థాయి నుంచి పైకొచ్చిన నిర్మాత. తెలంగాణవాడు. కష్టం విలువ తెలిసినవాడు. దీనికి తోడు అహంభావి అనే ముద్రపడిన వాడు. అందుకే అప్పుడప్పుడు ఇలా తిక్క వేశాలేసి ఇలా నాలుక్కర్చుకుని ముక్కు నేలకు రాసినంత పనిచేస్తాడు. బలగం సినిమా విషయంలో ఇదే జరిగింది. ముందు దిల్‌ రాజును ప్రశంసించాలి. ఎందుకంటే.. మంచి సినిమాలు నిర్మించడంలో అందరికీ భిన్నం. కాస్తో కూస్తో కుటుంబ విలువలు.. తల్లిదండ్రులు, ప్రేమ అనే సున్నితమైన అంశాలను తీసుకుని మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తీసి సక్సెస్‌ అనిపించుకుని నాలుగు పైసలు సంపాదించి ఎక్కడికో ఎదిగాడు. కష్టపడ్డాడు. నిలదొక్కుకున్నాడు. ప్రశంసించాల్సిందే.

కానీ బలగం సినిమా విషయంలో ఎక్కడబడితే అక్కడ ప్రదర్శించుకుంటే.. ఊరంతా కలిసి చూస్తే మా థియేటర్లకు ఎవడొస్తడు… ? మాకు నష్టం కాదా..? ఆ క్రిమినల్‌ చర్యలు తీసుకోండని నిజామాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేయడంతో దిల్‌ రాజుపై అన్ని సెక్షన్ల నుంచి దాడి మొదలైంది. వ్యాపారమే ముఖ్యమా…? లాభాలే కావాలా..? అయితే సారా దుకాణం పెట్టుకో .. అని అప్పటి వరకు మెచ్చుకున్న నోళ్లన్నీ తుపుక్‌మని ఉమ్మినంత పనిచేశాయి. దుమ్మెత్తి పోశాయి. దీంతో దెబ్బకు దెయ్యం దిగింది.. కాదు కాదు.. దెబ్బకు దిల్‌ రాజు దిగొచ్చాడు. ఓ ప్రెస్‌మీట్‌ పెట్టేశాడు. ఏ అదంతా అమెజాన్‌ వాడి కోసం ఉత్తిత్తి ఫిర్యాదే.. నా గురించి తెల్వదా.. మీకు. మీరు ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు సినిమాలు తిలకించండి.. కావాలంటే నేనే ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తా… నేను వద్దంటే ఆగుతదా..? ఏ ఊకో.. అని మెల్లగా సముదాయించి.. చల్లగా జారుకున్నాడు. ఇదీ సంగతి.. తెలంగాణ సినిమా, తెలంగాణ జనం అంటే అంతే మరి. కోపమొచ్చినా, ప్రేమొచ్చినా ఇలా ప్రదర్శిస్తరు మరి…

You missed