ఆర్టీసీ చైర్మన్ , నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి భగ్గుమన్నారు. ఇందూరు బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్, ఇందూరు బీజేపీ నేతలనుద్దేశించి ఆయన ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. డిచ్‌పల్లిలో గురువారం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పెంచిన గ్యాస్ ధరకు నిరసనగా చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల తీరును ఉతికారేశారు. తాను నివురు గప్పిన నిప్పుగా అభివర్ణించారాయన. మీద బూడిదే కనిపిస్తుంది. కానీ.. లోపల భగ భగ మండే నిప్పు కణికలు రగిలుతూ ఉంటారు. ముట్టుకోవాలని చూశారో.. మాడి మసైపోతారు … గట్టి వార్నింగ్ ఇచ్చారాయన. అంతే కాదు.. బీజేపీ నేతల తతంగాలన్నీ చూస్తున్నానని, ఎవరేం చేస్తున్నారో.. ఎక్కడ తప్పులకు పాల్పడుతున్నారో.. ఎక్కడెక్కడ ఎలాంటి వేశాలు వేస్తున్నారో.. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఎట్లా కాలం గడుపుతున్నారో అన్నీ అన్నీ తన నోటీసులో ఉన్నాయని ఎవరినీ వదిల పెట్టబోనని ఆయన భగ్గుమన్నారు.
మాట్లాడితే గుడుల పేరు తీసే బీజేపీ నేతలెవరైనా ఒక్క గుడైనా కట్టించాడా అని నిలదీశారాయన. తాను 80 గుడులను కట్టించానని గుర్తు చేశారు. ఇచ్చేదీ మనమే..ప్రజలను రక్షించేది మనమే.. వారి సంక్షేమం చూసేదీ మనమే… కానీ బీజేపీ నేతలు ఆఖరికి వచ్చి అబద్దాలతో ప్రజలను మభ్య పెడదామని చూస్తారని విమర్శించారు. అబద్దాలతోనే అర్వింద్, బండి సంజయ్.. ఇంకా ఇద్దరు గెలిచారన్నారు. బీజేపీ నేతలు ఇళ్లళ్లకు వస్తే కర్రు కాల్చి వాతపెట్టాలని, సిలిండెర్లు విసిరి కాళ్లు విరగొట్టాలని బాజిరెడ్డి గోవర్దన్ ప్రజలకు పిలుపునిచ్చారు.