తెలంగాణ జాగృతి… మొన్నటి వరకు సైలెంట్. కమిటీలు లేవు. అవే పాత కమిటీలు. కార్యక్రమాలు లేవు. యాక్టివిటీసూ తక్కువే. కానీ ఒక్కసారిగా తెలంగాణ జాగృతి తెరపైకి వచ్చింది. నిస్తేజంగా ఉన్న సభ్యుల్లో నూతనోత్తేజం నింపే కార్యక్రమానికి నాంది పలికింది ఈ రోజు జరిగిన విస్తృత స్థాయి సమావేశం. ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేర సీబీఐ నిన్న ఏడు గంటల పాటు విచారణ చేయడం.. మళ్లీ 91 సీఆర్పీసీ కింద నోటీసులివ్వడం… చూస్తే ఇప్పుడప్పుడే మోడీ, మోడీ చేతిలోని విచారణ సంస్థలు ఈ ఇష్యూను వదిలేలా లేవు. మానసికంగా కవితను దెబ్బ తీయాలనే బీజేపీ వ్యూహం ఇలా అమలు చేస్తూ వస్తోంది. అయితే బీఆరెస్‌ పేరుతో 14న ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ సమాయత్తమయ్యాడు. అక్కడ అన్నీ సిద్దమవుకతున్నాయి. మరోవైపు సీబీఐ ఇక్కడ కవితను ఇరకాటంలో పెట్టే ప్రయత్నాన్నీ ముమ్మరం చేస్తూ వస్తోంది.

ఈ క్రమంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. కవిత విచారణ.. అంతా బీఆరెస్‌కు సంబంధం లేకుండా చూస్తున్నాడు. ఇప్పుడు నేతలంతా ఈ కేసు చుట్టే ఆలోచించి.. ప్రసంగించి.. విమర్శించి.. ఖండించడంలోనే ఉంటే తమ ఉద్దేశ్యం పక్కదారి పట్టి బీజేపీ వేసిన ప్లాన్‌లో పావులమవుతామని కేసీఆర్‌ కనిపెట్టాడు. అందుకే ఈ ఎత్తుగడను చిత్తు చేసేందుకు ఆయన జాగృతిని రంగంలోకి దించాడు. నిన్న రాత్రి హుటాహుటిన నిర్ణయం జరిగిపోయింది. రాత్రికి రాత్రే మెస్సేజ్‌లు పోయాయి. ఇవాళ హైదరాబాద్‌లో కవిత నేతృత్వంలో మీటింగు నడిచింది. కవులు, కళాకారులు మళ్లీ తమ కలాలకు,గళాలకు పదును పెట్టారు. మోడీపై విరుచుకుపడ్డారు. ధర్మంపై దాడులా.. ? బతుకమ్మపై నిందలా..? అంటూ మోడీని చెడామడా తిట్టిపోశారు. ఢిల్లీ కోటలు బద్దలు కొడతామంటూ ఆ వేదికగా ఓ పిలుపును కూడా ఇచ్చారు. దీన్ని సోషల్‌ మీడియాలో జాగృతి సభ్యులు పోస్ట్‌ చేశారు.

 

ఉద్యమ ఊపిరి ఇంకా చల్లారలేదు ముందు ముందు జాగృతి ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేసి ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం ✊🏻✊🏻

You missed