vastavam.in Exclusive
Dandugula Srinivas
మునుగోడు ఎన్నికల ముగిసిపోయాయి. అంతా మొన్నటి వరకు అటు వైపే చూశారు. ఎవరు గెలుస్తారా..? అని. గెలిచారు. ఓడారు. ఆట ముగిసింది. చర్చ ఆగింది. ఇక అంతా రొటీన్. అంతా ఎవరి పనుల్లో వారు పడిపోయారు. ప్రత్యామ్నాయం మేమే అంటూ బీజేపీ , కాంగ్రెస్ ఎవరికి వారే చెప్పుకుంటున్నా… మేమే విజేతలమని టీఆరెస్ అనుకుంటున్నా… చివరకు ఓటరు నాడి ఎలా ఉంటుందో తెలియదు. అది అన్ని పార్టీలకూ తెలుసు. సరే… ఇదంతా పక్కన పెట్టేద్దాం… అసలు సంగతి కొద్దాం. మునుగోడుకు ముందు నుంచే బీజేపీ పక్కా పోలింగ్ ప్లాన్‌తో రంగంలోకి దిగింది. ఇది కనీసం టీఆరెస్ వర్గాలకు సమాచారం కూడా లేకపోవచ్చు. నిరుద్యోగ యువతులకు గాలం వేసింది. రోజు ఐదారు గంటల పని పేరు వారికిచ్చేది రెండొందల రూపాయలు. చేపంచే పనేమిటో తెలుసా…? సర్వే పేరుతో ఇంటింటికి తిరగాలి. ఎవరికి ఓటేస్తారు..? అని అడగరు. అడిగితే మొదటికే మోసం వస్తుంది. ఆ విషయం బీజేపీ శ్రేణులకు తెలుసు. అందుకే వాళ్లు ఎత్తుగడ చాలా పకడ్బందీగా ఉంది. ఎలా అంటే…. ఇంటింటి సర్వే పేరుతో అమ్మాయిలు బాజాప్తా బీజేపీ వాళ్లమని చెబుతారు. మేం బీజేపీ నుంచి వచ్చాం … సర్వే చేస్తున్నాం అని పరిచయం చేసుకుంటారు. అప్పటికీ వాళ్లకు డౌట్ వస్తుంది. బీజేపీ నుంచి వచ్చి తమ ఓటు ఎవరికి అని అడుగుతారేమో.. అని జాగ్రత్త పడతారు. కానీ వీళ్లు అలా అడగరు. మీకు ఓటుందా..? ఓటు లేకపోతే దరఖాస్తు చేసుకోండి…అని మొదలు పెడతారు. ఈ మాటలతో ప్రజలకు కొంత నమ్ముతారు. తమ కోసమే కదా వీళ్లు అడుగుతున్నారు .. అని భ్రమపడతారు. ఆ తర్వాత మీ పేరు, మీ వృత్తి అంటూ మాటల్లో దించుతారు. ఆ తర్వాత అసలు సంగతికొస్తారు. ఇవే రెండు ప్రశ్నలు కీలకం వీరికి. అవేమిటో తెలుసా..?
మీ కులమేమిటి..? చెప్తారు. ఎందుకంటే అప్పటి వరకు అడిగినవన్నీ తమకు కావాలసినవే. తమ మంచి కోరేవే అనే విధంగా ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత చివరగా సెల్ నెంబర్. ఈ రెండు బ్రహ్మాస్త్రాలు బీజేపీకి.
మొత్తంగా సర్వే కానీ సర్వేతో బీజేపీ ఇదంతా ఎందుకు చేస్తుంది…? నిరుద్యోగ యువతులతో శ్రమదోపిడీ చేపిస్తూ మరీ ఎందుకీ వివరాలు సేకరిస్తుంది..? అసలు అమ్మాయిలనే సర్వేకు ఎందుకు ఎంచుకుంది..? ఎవరికి ఓటేస్తారు..? అని అనే ప్రశ్నకే ఇక్కడ చోటు లేకుండా ఈ మిగిలిన వివరాలు తీసుకొని ఏం చేస్తారు…?? ఈ ప్రశ్నలకు సమాధానాలే … బీజేపీ మదిలో ఉన్న ముందస్తు ప్లానింగ్. అవి తరచి చూస్తే గానీ ఎవరికీ అర్థం కావు. చివరకు టీఆరెస్ వర్గాలకు కూడా. ఎందుకంటే ఇందులో అంతా అంతర్లీమైన గుట్టు దాగుంది.
అమ్మాయిలనే ఎందుకు ఎంచుకున్నారు..?
ఇంటింటి సర్వే పేరుతో అమ్మాయిలు వెళ్తే తొందరగా ఇంట్లో ఉన్న వారు రిసీవ్ చేసుకుంటారు. మగవాళ్లయితే అంత రెస్పాన్స్ ఉండదు. అందులోనూ అమ్మాయిలు తక్కువ కిరాయికే వస్తున్నారు. కేవలం రెండు వందలు … ఆ పైన అదనంగా మరో యాభై…. అది కూడా పదిరోజులకొకసారి..
బీజేపీ అని చెప్పి మరీ సర్వే చేస్తున్నారు…? డౌట్ రాదా..?
అలా డౌట్ రాకుండా …. ఎవరికి ఓటు అనే విషయం అడగరు. ఓటు హక్కు గురించి మట్లాడతారు. మీ ఓటు ఉందా? అంటారు. లేకపోతే ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్తారు. మెల్లగా మాటల్లో దించుతారు. సర్వే చేయమని పైన అధిష్టానం పంపిందంటూ ఓ ఐడీ కార్డు కూడా మెడలో వేసుకుంటారు. అడిగిన వారికి చూపుతారు. తాము మీకోసమే అన్నట్టుగా సర్వే కొనసాగుతుంది.
కేవలం ఈ సమాచారంతో ఏం ఉపయోగం బీజేపీకి..?
ఇందులో వేసే ప్రశ్నలన్నీ దాదాపు ప్రజలను మభ్యపెట్టి భ్రమల్లో ఉంచేందుకే….. రెండు మూడు ప్రశ్నలకు ఆన్సర్లు మాత్రమే వారికి కావాలి.
1. ఓటు హక్కు ఉందా..?
2. ఏ కులం…?
3. సెల్ నెంబర్…
వీటి ద్వారా బీజేపీ చేయబోతుంది ఏమిటో తెలుసా..?
ఓటు హక్కు ఉన్న వారు ఆ ఏరియాలో ఎంత మంది ఉన్నారు. ఇందులో కులాల వారీగా ఎంత మంది. వారి సెల్ నెంబర్ .. వీటిని నిక్షిప్తం చేస్తారు. డేటా సురక్షితం. ఇక అసలు సమయానికి సోషల్ మీడియా రంగంలోకి దిగుతుంది. కులాల వారీగా వరాలుండొచ్చు. మహిళల వారీగా పథకాలు రూపకల్పన కావొచ్చు.. వీటన్నింటికన్నా ముఖ్యం.. సెల్ ఫోన్ల ద్వారా ప్రజల మదిలో ఆలోచనలు రేకెత్తించి మత్తెక్కించే మతం ప్రవచనాలూ ఉండొచ్చు… మొత్తానికి ప్రభావితం చేయాలి. ప్రభావితం కాబడాలి. దీని కోసం ఈ సర్వే డేటా సేకరణ పక్కాగా జరుగుతుంది. సోషల్ మీడియా ఎంత బలంగా బీజేపీ ఉపయోగించుకుంటుందో… వినియోగించుకోబోతుందో…. ఇదో పతాక స్థాయి …. దీని రిజల్టు చూసి దిమ్మదిరగాలి. అలాంటి ప్లానింగ్‌తో బీజేపీ ఉంది…? టీఆరెస్‌కు కూడా ఇది అంతుచిక్కలేదు. చిక్కదు. పట్టదు. పట్టించుకోదు. పట్టింపులేదు.
Dandugula Srinivas