మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో టీఆరెస్‌లో జోష్ పెరిగింది. వాస్తవంగా అనుకున్న రిజల్ట్ రాలేదు. మెజారిటీ ఇంకా వస్తే కేసీఆర్ బీజేఆర్‌కు మంచి ఊపు వస్తుందని భావంచాడు. కానీ అది జరగలేదు. టఫ్ ఫైటే నడిచింది. కానీ గెలుపు గెలుపే. మొత్తానికి పదివేల ఓట్ల మెజారిటీతో టీఆరెస్ బయటపడింది. మునుగోడు ఎన్నికకు ముందు చండూరులో కేసీఆర్ భారీ బహిరంగ పెట్టి… తనను మునుగోడులో గెలిపించి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సద్ది కట్టి పంపించాలని కోరాడు. కొన్ని ప్రజల కోరికలు కూడా డిమాండ్లు కూడా అవి కూడా పదిహేను రోజుల్లో తీర్చేస్తానన్నాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు కేసీఆర్. ఈనెల 13న తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ బహిరంగసభ కు సన్నాహాలు చేస్తున్నాడు కేసీఆర్.
దీనికి మునుగోడు అభినందన సభ నామకరణం చేయనున్నారు. పేరుకు అభినందన సభే అయినా.. .జిల్లా మొత్తంగా పార్టీని మరింత బలోపేతం చేసి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు భారీ నజరానాలు ,వరాలు కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. దాదాపు 300 కోట్ల నిధులను మనుగోడుతో పాటు నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేటాయించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆరెస్‌కు తొలిబోణి ఇచ్చి గౌరవంగా తనను జాతీయ రాజకీయాలకు పంపుతున్న మునుగోడు ఎన్నికల ఫలితాలను కేసీఆర్ ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటు మునుగోడుతో పాటు ఇచ్చిన హామీలతో పాటు … నల్లగొండ జిల్లా మొత్తానికి వరాలు కురిపించనున్నాడు. ఇదే వేదికగా తన జాతీయ రాజకీయాల ఎజెండా… లక్ష్యం… అన్నీ ప్రజలతో పంచుకోనున్నాడు. మోడీ పాలన, కేంద్రం వైఖరిపై మరోసారి విరుచుకుపడనున్నారు. జాతీయ రాజకీయాల ఆరంగేట్రానికి ఆ సభ తొలి నాందిగా కానుంది.