ఒకే ఒక్క ఫోటో… అత‌ని పేరును రాష్ట్ర వ్యాప్తంగా వినిపించేలా చేసింది. ఫోటోగ్రాఫ‌ర్లంతా ఓ వైపు సీఎం ఫోటోలు తీసే బిజీలో ఉంటే ఈ ఫోటో గ్రాఫ‌ర్ మాత్రం ఆ సీఎంను చూసేందుకు ఇద్ద‌రు పిల్ల‌గాండ్లు ప‌డ్డ క‌ష్టం.. ఎట్లైనా సీఎంను చూడాల‌నే వారి త‌ప‌న‌ను ప‌ట్టించింది. అంతే ఆ ఫోటో తెల్లారి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. అది కేటీఆర్ కంటా ప‌డింది. దానికి ఫిదా అయిన ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఫోటోగ్రాఫ‌ర్ ను అభినందించారు. ఆ త‌ర్వాత అర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్‌గుప్తా వీరిద్ద‌రి పిల్ల‌ల‌ను పిలిపించి వారికి బ‌హుమ‌తులిచ్చి సంతోష‌పెట్టాడు. ఫోటోగ్రాఫ‌ర్‌ను అభినందించి శాలువా క‌ప్పి స‌త్క‌రించారు.

ఆ ఫోటోగ్రాఫ‌ర్ పేరు భాను తేజ. నిజామాబాద్ వాసి. జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌లం అర్గుల్ సొంతూరు. అంత‌కు ముందు వీడియో గ్రాఫ‌ర్‌గా అనుభ‌వం ఉంది. ఢిల్లీ, హైద‌రాబాద్‌, నిజామాబాద్‌ల‌లో ప‌నిచేశాడు. ప్ర‌స్తుతం వెలుగు ప‌త్రిక‌లో ఫోటోగ్రాఫ‌ర్‌గా చేస్తున్నాడు.

మొన్న నిజామాబాద్‌కు సీఎం వ‌చ్చిన‌ప్పుడు తీసిన ఫోటో ఇది. అన్ని రొటీన్ ఫోటోల‌తో పాటు దీన్నీ స్పెష‌ల్‌గా క‌వ‌ర్ చేశాడు భాను. ఫ్లెక్సీల‌లో నా ఫోటో లేద‌నే ఓ నేత గ‌గ్గోలు పెట్టిన వైనం… సీఎం స‌భ‌కు ఖాళీ కుర్చీల క‌ళ‌… సీఎం కాన్వాయ్ అడ్డగింత‌.. లాఠీచార్జి… అన్నీ కామ‌న్‌గా చేయాల్సిన డ్యూటీలో భాగంగా చేసుకుంటూ పోయాడు. అవ‌న్నీ అచ్చ‌య్యాయి. ఇదీ అచ్చ‌య్యింది. కానీ వాట‌న్నింటినీ ప‌క్క‌కు తోసి.. ఇదే హైలెట్ అయ్యింది. అంతేక‌దా.. ఓ వెరైటీ ఫోటో.. ఎవ‌రికి క‌నిపించ‌ని ఫోటో.. ఏ ఫోటోగ్రాఫ‌ర్ బందించ‌ని ఫోటో… అలా భాను కెమెరాకు చిక్క‌డం.. అది వైర‌ల్ కావ‌డంతో అటు హైద‌రాబాద్ వెలుగు ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి, ఇందూరు మీడియా మిత్రుల నుంచి నేత‌ల నుంచి …… ప్ర‌శంస‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి.

వాస్త‌వానికి వెలుగు బీజేపీ ప‌త్రిక‌. ఈ ఫోటో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం దానికి లేదు. ఎందుకంటే ఏ పార్టీ ప‌త్రిక ఆ పార్టీ బాకానే ఊదాలి. వేరే పార్టీ కి అనుకూల‌మైన‌వి వేయ‌డం నిషిద్దం. అంతే. అదే మీడియాలో న‌డిచేది. కానీ ఇక్క‌డ వెలుగు క‌నీస ప‌త్రిక విలువ‌ల‌ను పాటించింది. ఫోటో ప్ర‌త్యేక‌త‌ను గుర్తించింది. ఆ ప్రాధాన్య‌త‌ను ప‌ట్టుకుంది. అందుకే అది ఓ వెలుగు వెలిగింది. ఫోటోగ్రాఫ‌ర్ భానుకు, వెలుగు ప‌త్రిక‌కు వాస్త‌వం అభినంద‌న‌లు….

You missed