కేసీఆర్ నిన్న మునుగోడు వేదిక‌గా చేసిన ఘ‌ర్జ‌న‌కు ధీటుగానే సాగింది బీజేపీ అమిత్ షా స‌భ‌. షా త‌న ప్ర‌సంగం ఆసాంతం కేసీఆర్‌ను టార్గెట్ గా చేసుకునే సాగింది. కేసీఆర్ ను , ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు అమిత్ షా త‌న ప్ర‌సంగంలో. మ‌ళ్లీ టీఆరెస్ అధికారంలోకి వ‌స్తే కేటీఆర్ సీఎం అవుతాడు కానీ ద‌ళితుడు కాద‌ని రెచ్చగొట్టే ప్ర‌య‌త్నం చేశాడు. వ‌చ్చేది బీజేపీ ముఖ్య‌మంత్రేన‌ని ధీమా వ్య‌క్తం చేశాడు.

చాలా వ‌ర‌కు పాత ప్ర‌సంగమే త‌న నోటి వెంట వ‌చ్చింది. మాట్లాడిన కొన్ని మాట‌లూ ఘాటుగానే సాగాయి. పెంచిన పెట్రోల్ ధ‌ర‌లు అన్ని రాష్ట్రాలు త‌గ్గిస్తే.. ఇక్క‌డ త‌గ్గించ‌లేద‌న్న అమిత్ షా…. హుజురాబాద్‌లో ద‌ళిత బంధు ఎంత మందికి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించాడు. గెలుపు కోసం ఎన్నిక‌ల కోస‌మే ప‌థ‌కాలు ర‌చించ‌డం కేసీఆర్‌కు అల‌వాట‌ని చెప్పుకొచ్చాడు. రాజ‌గోపాల్‌ను గెలిపిస్తే అవినీతి టీఆరెస్ ప్ర‌భుత్వం అంత‌మ‌వుతుంద‌ని ప‌రోక్షంగా ఈ గెలుపు బీజేపీకి ఎంత ఇంపార్టెంటెంటో అనే విష‌యం ప్ర‌జ‌ల వ‌ద్ద ఉంచాడు. బీజేపీ గెలిస్తే అభివృద్ది చేస్తామ‌ని చెప్పాడే త‌ప్ప ఏమీ చేస్తామో చెప్ప‌లేదు. చెప్ప‌డానికీ బీజేపీకి అక్క‌డ స్పేస్ లేదు.

కేసీఆర్ ప్ర‌శ్న‌ల‌ను అమిత్ షా ప‌ట్టించుకోలేదు. అంత‌కు ముందు మాట్లాడిన బీజేపీ నేత‌లంతా కేసీఆర్ పై ముప్పేట దాడి చేశారు. విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఒక్క‌డు మ‌రీ విమర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌కు పోకుండా విష‌యంతో కూడిన ప్ర‌సంగం చేశాడు. మిగిలిన వారంతా గ‌తంలో మాదిరిగానే కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారు ష‌రా మామూలుగా.

You missed