కొత్త ప‌థ‌కాల అమ‌లు.. పాత ప‌థ‌కాల ప‌రుగులు.. గ‌వ‌ర్న‌మెంట్ ఈ మ‌ధ్య కాలంలో తీసుకుంటున్న‌, తీసుకోబోయే నిర్ణ‌యాలేవైనా అవి హుజురాబాద్ కేంద్రంగా చ‌క్క‌ర్లు కొట్టేటివే. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ఇక్క‌డే ఫైల‌ట్ ప్రాజెక్టుగా కేసీఆర్ అమ‌లు చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ను దృష్టిలో పెట్టుకొని రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఇదంతా చేస్తున్నాడ‌ని ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో.. వాసాల‌మ‌ర్రిలో ఓ 76 మందికి ద‌ళిత‌బంధు ఇచ్చేసి తాత్కాలికంగా రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు బ్రేక్ వేసుకున్నాడు.

ఈ రోజు హుజురాబాద్‌కు ద‌ళిత‌బంధు అమ‌లు కోసం 500 కోట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు జీవో జారీ అయ్యింది. ఇక్క‌డ ఈ ప‌థ‌కం ప‌క‌డ్భందీగా అమ‌లు కావొచ్చేమో.. కానీ అన్ని నియోక‌జ‌వ‌ర్గాల్లో ఇదే మాదిరిగా, ఇంతే నిబ‌ద్ధ‌త‌తో నిధులు విడుద‌ల చేసి అమ‌లు చేస్తార‌నేది అనుమాన‌మే. రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమ‌లు చేయాలంటే ల‌క్ష కోట్లు అవ‌స‌రం. అంత ఖ‌ర్చు ప్ర‌భ్వుతం పెట్ట‌లేదు. అన్ని నిధుల్లేవు. జీతాలు ఇచ్చేందుకే ప్ర‌తి నెల తంటాలు ప‌డే ప‌రిస్థితి ఉంది. అయితే ఈ ఎన్నిక గ‌ట్టెక్కితే చాలు.. త‌ర్వాత ప‌రిస్థితి త‌రువాత చూసుకుందామ‌నే దోర‌ణిలో కేసీఆర్ వైఖ‌రి ఉన్న‌ది.

అయితే ప‌డ‌కేసిన ప‌థ‌కాలు కూడా ఇక్క‌డే ప‌రుగులు పెడ్తున్నాయి. ఆస‌రా పింఛ‌న్లు ల‌క్ష‌ల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కానీ వాటి జోలికి వెళ్ల‌డం లేదు. తాజాగా వృద్ధాప్య పింఛ‌న్ 65 సంవ‌త్స‌రాల నుంచి 57 57 సంవ‌త్స‌రాల‌కు కుదిస్తూ అర్హులైన వారిని ఎంపిక చేసి వెంట‌నే పింఛ‌న్లు మంజూరు చేయాల్సిందిగా ప్ర‌భుత్వం ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలు అన్ని జిల్లాల‌కు వెళ్ల‌లేదు. కేవ‌లం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే ఈ ఆదేశాలు ప‌ని చేస్తున్నాయి.

అంటే హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో అర్హూలైన వారికి మాత్ర‌మే ఆస‌రా పింఛ‌న్ అందుతుంద‌న్న‌మాట‌. కానీ ప్ర‌భుత్వం చెప్ప‌డం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ల‌వుతుంద‌నే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్న‌ది. క్షేత్ర‌స్థాయిలో అలా జ‌ర‌గ‌డం లేదు. మున్ముందు ఆగిపోయిన ప‌థ‌కాలు అమ‌లు జ‌రిగినా.. కొత్త ప‌థ‌కాల‌కు రెక్క‌లొచ్చినా అవి హుజురాబాద్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తారే త‌ప్ప రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ మేలు జ‌రిగేలా చేయాల‌నే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేదు. ఎందుకంటే ఖ‌జానా ఖాళీగా ఉంది. కానీ హుజురాబాద్‌లో ప్ర‌యోజ‌నం చేకూరాలంటే ఈ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న‌లు ప‌థ‌కం ప్ర‌కారం వెలువ‌డాల్సిందే. ఇప్పుడు అదే జ‌రుగుతున్న‌ది.

You missed