కూటి కోసం కోటి తిప్ప‌లంటారు. ఈ ఇద్ద‌రు మంత్రుల ప‌రిస్థితి చూస్తే ఒక్క గెలుపు కోసం కోటి తిప్ప‌లు ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్ రావుల‌కు హుజురాబాద్ ఎన్నిక ఓ అగ్ని ప‌రీక్ష‌లా మారింది. కేసీఆర్ ఈ గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించ‌డంతో మంత్రుల‌కు ముచ్చెమ‌ట‌లు త‌ప్ప‌డం లేదు. స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. శ‌క్తియుక్తుల‌న్నీ ప్ర‌యోగిస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా నాయ‌కులంద‌రికీ గులాబీ కండువా క‌ప్పేస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల పార్టీల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు గాలం వేస్తున్నారు. ఆగిన ప‌థ‌కాలు ప‌రుగులు పెట్టిస్తున్నారు. అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు.

ఆఖ‌రికి ఇంచార్జీగా హ‌రీశ్‌రావును నియ‌మించినా.. ఈ ఇద్ద‌రు మంత్రుల‌కు కోటి తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. మంత్రి ప‌ద‌వి ఉండాల‌న్నా.. భ‌విష్య‌త్తులో కేసీఆర్ ఆశీస్సులు కొన‌సాగాల‌న్నా.. ఈ ఎన్నిక గెలుపు వీరిద్ధ‌రికి అనివార్యంగా మారింది. అదే అగ్ని ప‌రీక్ష అయ్యింది. దీంతో రోజులు గ‌డుస్తున్నా కొద్ది వీరి దోర‌ణి ప్ర‌వ‌ర్త‌న ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారుతున్న‌ది. ప‌క్కా ఓ గ‌ల్లీ లీడ‌ర్ల‌లాగా ప్ర‌వ‌ర్తిస్తున్న వీరి దోర‌ణి సొంత పార్టీ నేత‌ల‌కే ఇబ్బందిక‌రంగా మారుతున్న‌ది.

ఎర్ర‌బెల్లి తాజాగా మ‌రో వివాదంలో ఇరుక్కున్నాడు. క‌మ‌లాపూర్ ఎంపీపీని పార్టీలోకి ఆహ్వానించి భంగ‌ప‌డ్డ ఆయ‌న ఆమె ప‌ట్ల హుందాగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. అనుచ‌రుల‌తో సోష‌ల్ మీడియాలో అస‌భ్యక‌ర పోస్టులు పెడుతున్న ప‌ట్టించుకోకుండా క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని బీజేపీ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో అక్క‌డ రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందే ఎవ‌రికి వారు త‌మ నోటికి వ‌చ్చింది వాగేస్తున్నారు. హుందా రాజ‌కీయాల‌కు ఇక్క‌డ నీళ్లొదిలేశారు. మంత్రుల‌మ‌నే విష‌యాన్ని కూడా మ‌రిచిపోతున్నారు. గెలుపు కోసం అష్ట‌వంక‌ర‌లు తిరుగుతున్నారు. అడ్డ‌దారులు తొక్కుతున్నారు.

You missed