బీజేపీ జాతీయ నాయ‌కుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాజ‌కీయాల పై సీరియ‌స్‌గా దృష్టి సాధించాడు. ఆ పార్టీని తెలంగాణ‌లో బ‌లోపేతం చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ఇక్క‌డి నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉంటున్నాడు. పార్టీ ప‌రిస్థితిపై ఆరా తీస్తున్నాడు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టెందుకు పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే హుజురాబాద్ ఉప ఎన్నిక ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన‌ట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డంతో త‌మ‌కు క‌లిసివ‌చ్చే అంశంగా అమిత్ షా భావిస్తున్నాడు. సీఎంతోనే విభేదించి ఢీఅంటే ఢీ అనే రీతిలో హోరాహోరీ యుద్ధానికి సిద్ధ‌మైన త‌రుణంలో హుజురాబాద్‌లో బీజేపీ విజ‌యం ఆ పార్టీ మ‌నుగ‌డకు దోహ‌దం చేయ‌నుంది. అటు టీఆరెస్ సైతం ఎలాగైనా ఇక్క‌డ గెల‌వాల‌ని స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్న‌ది. ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి పాద‌యాత్ర‌తో ప్ర‌చారం చేసుకుంటుండ‌గా.. కేసీఆర్ తెర వెనుక‌నుండే అక్క‌డ వాతావ‌ర‌ణాన్ని త‌న చెప్పు చేత‌ల్లో ఉంచుకునే విధంగా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. రాజ‌కీయంగా ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌ల‌హీనం చేసేందుకు ఏమేమి చేయాలో అన్ని చేసుకుంటు పోతున్నాడు. అయితే నోటిఫికేష‌న్‌కు మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌నే ప్ర‌చారం రాజేంద‌ర్ వ‌ర్గంలో ఆందోళ‌న‌ను పెంచుతున్న‌ది. అప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల ఖ‌ర్చును త‌ట్టుకోలేక యుద్ధ‌రంగంలో చేర‌గిలబ‌డ‌తాడ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఇదే జ‌రిగితే టీఆరెస్‌కు జ‌రిగే న‌ష్ట‌మేమి లేదు. ఆ పార్టీ త‌మాషా చూస్తు పూర్తిగా అక్క‌డి ప‌రిస్థితుల‌ను త‌న గుప్పిట్లో బంధించేస్తుంది. ఎంత‌టి ఖ‌ర్చుకైనా వెనుకాడ‌ది. కానీ అమిత్ షా హుజురాబాద్ ఎన్నిక పై న‌జ‌ర్ పెట్ట‌డంతో ఆగ‌స్టులోనే ఈ తంతు పూర్త‌య్యేలా చేద్ధామ‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప‌శ్చిమ‌బెంగాల్‌లోని ఉప ఎన్నిక విష‌యంలో రాజ‌కీయ మంకుప‌ట్టు వీడితే హుజురాబాద్ ఎన్నిక కూడా సాధ్య‌మ‌వుతుంది. కానీ ఇక్కడి ఎన్నిక‌కు అంత‌టి ప్రాధాన్య‌త ఇస్తారా? అనేది చూడాలి. ఈట‌ల మాత్రం ఆగ‌స్టులోనే ఎన్నిక జ‌రుగుతుంద‌నే ధీమాలో త‌మ ప్ర‌చారంలో వేగం పెంచుతున్నాడు. ఎంతంత ఆల‌స్యమ‌వుతూ వ‌స్తే అంత‌లా ఈట‌ల రాజేంద‌ర్‌కు న‌ష్ట‌మే జ‌ర‌గ‌నుంది.

You missed