ఇప్పుడు రాష్ట్రంలో అంతా ద‌ళిత బంధు గురించే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్న, ఏ కొత్త ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసిన అది చ‌ర్చ‌కు వ‌స్తుంది. వివాద‌స్ప‌ద‌మూ అవుతుంది. అయినా కేసీఆర్ ఇవేమీ ప‌ట్టించుకోడు. ఆయ‌న‌కుండే స‌మీక‌ర‌ణ‌లు ఆయ‌న‌కుంటాయి. పార్టీ ప్ర‌యోజ‌నాలు అంతిమంగా త‌న ల‌క్ష్యం. అయితే మొన్న‌టి వ‌ర‌కు ఒక‌లెక్క‌.. ఇక‌పై మ‌రోలెక్క అన్న‌ట్టుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో ప‌రిణామాలు మారుతూ వ‌స్తున్నాయి. లోలోప‌ల లోపాలు, అవ‌మానాలు, వివ‌క్ష‌లు మౌనంగా భ‌రిస్తూ వ‌చ్చిన చాలా సెక్ష‌న్లు క‌లుగులోంచి ఎలుక‌లు బ‌య‌ట‌కు వ‌చ్చిన మాదిరిగా తిర‌గ‌బ‌డుతున్నారు. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆత్మ‌గౌర‌వం కోసం తండ్లాతున్నారు. ఆత్మ‌గౌర‌వం కోసం కొట్లాడిన తెలంగాణ జాతి ఇప్పుడు సామాజిక ఆత్మ‌గౌర‌వం కోసం వెతుకులాడుతుంది. ప‌రాయోడి పాల‌న‌లో అవ‌మానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నాం… స్వ‌ప‌రిపాల‌న‌లో అంత‌కు మించిన అగౌర‌వాలు మాక‌వ‌స‌ర‌మా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ ద‌ళిత బంధు పేరును తెచ్చి ఎస్సీల సాధికారిత కోసం ప‌నిచేస్తాన‌నే మాట తీశారో… అప్ప‌టి వ‌ర‌కు అణ‌గారి దెబ్బ‌తిని ఉన్న ఆ జాతి వ‌ర్గీయులంతా ఒక్కొక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. కేసీఆర్ ద‌ళితులు అనే తేనెతుట్టెను క‌దిపాడు. ఇప్పుడు ఆ తేనెటీగ‌ల‌న్నీ కేసీఆర్‌ను కుట్టేందుకు బ‌య‌లుదేరాయి. వెంటాడుతున్నాయి. చుట్టుముడుతున్నాయి. ద‌ళిత‌బంధు స్కీమ్ ప్ర‌క‌ట‌న రోజే ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్ వీఆరెస్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేసీఆర్ పై ద‌ళిత వ‌ర్గం తిరుగుబాటుకు ఇది నాందిగా మారింది. అంత‌కు ముందే ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళిని కేసీఆర్ అవ‌మానించాడ‌నే ముద్ర ఉంది. ఈ స‌మ‌యంలో ఆకునూరి ముర‌ళి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ద‌ళిత బంధు స్కీమ్ ఇది అవ‌స‌రం రీత్యా ఏర్పాటు చేసుకున్న ప్ర‌ణాళిక అని కొట్టిపాడేశాడు. కేసీఆర్‌కు ద‌ళితుల అభివృద్ధి పై చిత్త‌శుద్ధే లేద‌న్నాడు. ఇక రేపో మాపో బీఎస్పీ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అయిన ప్ర‌వీణ్‌కుమార్ త‌న మాట‌ల దాడిని పెంచాడు. ఇటీవ‌ల తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆరెస్ పార్టీలో కౌశిక్ రెడ్డి చేరిన స‌భ‌లో నిమ్న వ‌ర్గాల‌ను ఏక‌వ‌చ‌నంతో సంబోధించాడ‌ని కౌశిక్‌రెడ్డిని దునుమాడుతు సోష‌ల్ మీడియాలో ఘాటుగా పోస్ట్ చేశాడు. ఉన్న‌తవర్గాల‌ను గారు అని సంబోధించి, బ‌హుజ‌నుల‌ను ఏక‌వ‌చ‌నంతో మాట్లాడుతున్నాడ‌ని అందుకే బ‌హుజ‌న రాజ్యం రావాల‌ని కోరుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించాడు. ఇలా ద‌ళిత ఉన్న‌తాధికారులు ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన మేథావులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇది చాలదంటూ బీసీ సెక్ష‌న్ కూడా మెల్ల‌గా బుస‌లు కొట్ట‌డం ప్రారంభించింది. మ‌రి మాకు బీసీ బంధు లేదా? అని ప్ర‌శ్నిస్తున్న‌ది.

You missed