సీపీ కల్మేశ్వర్‌… ఎవ్వరి మాట వినడం లేదు. నా పేరు శివమణి నాకొంచెం మెంటల్‌..! అని శివమణి సినిమాలో నాగార్జున తరహా క్యారెక్టర్‌ అన్నమాట. అర్థరాత్రి నిక్కర్‌ వేసుకుని , చేతిలో లాఠీ పట్టుకుని అల్లరి మూకలను చెడ్డీలు పగిలేలా కొట్టాలన్నా.. లోపలోసి చెమటలు పట్టించాలన్నా ఆయనకే చెల్లింది. మొన్నటికి మొన్న జిల్లాలోని రౌడీ షీటర్లందరినీ పిలిపించి మాస్‌ వార్నింగ్‌ ఇచ్చి పంపాడు.

సక్కగా ఉండండి.. తిక్క వేశాలేస్తే పీడీ యాక్ట్‌ పెట్టి తాటా తీస్తా అని హెచ్చరించి పంపాడు. పనిలో పని మీరెటు వెళ్తున్నారో.. ఎవరెవరిని కలుస్తున్నారో కూడా నాకు తెలుసు.. అని పక్కలో బాంబు వేశాడు. కిక్కురుమనకుండా చేతులు ముడుచుకుని వెళ్లిపోయారు కొమ్ములు తిరిగిని రౌడీ మూకలు. కానీ అందరికీ తెలియని విషయం ఏమింటంటే.. రౌడీ మూకలకు డైరెక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చిన సీపీ.. పొలిటికల్ లీడర్లకు పరోక్షంగా వార్నింగ్‌లు ఎప్పుడో తన చేతల ద్వారా ఇచ్చేశాడు. మొన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న నేతలకు ఆయన పెద్ద తలనొప్పిలా మారాడు. ఎవరూ చెప్పింది వినడు. తనకు నచ్చిందే చేస్తాడు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ నేతల మాటలు చెల్లుబాటు కాలేదు. లా అండ్‌ ఆర్డర్‌ ప్రకారమే అంతా. డబ్బుల పంచే వ్యవహారంలోనైతే మెరుపుదాడులు చేసి మరీ అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపించాడు. అంతకు ముందు గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో వారు చేసే దాష్టీకాలు, కుల బహష్కరణలపై ఉక్కుపాదం మోపాడు.కేసులు పెట్టి లోపలేయించాడు. రాజకీయ నేతలే వారి జోలికి పోరు. అంత పవర్‌ పుల్ వీడీసీలంటే. అంత భయం నేతలకు వారంటే. కానీ సీపీ మాత్రం ఎవ్వరినీ వదల్లేదు. నేతలు ఎంత మొరపెట్టుకున్నా ససేమిరా అన్నాడు. ఎంపీ చెప్పినా, మంత్రి చెప్పినా వినలేదు. ఇప్పుడు అక్రమ మైనింగ్‌పై పడ్డాడు.

ఎవడినీ వదల్లేదు. మాక్లూర్‌ నుంచి మొదలు కొని గుట్టలన్నీ పొతం పట్టారు బీఆరెస్‌ నేతలు. ఇప్పుడు వీరి పాపాల చిట్టా తవ్వి తీస్తున్నాడు సీపీ. అర్బన్‌లో ప్రధానంగా ఇందులో పేరు మోసినోడు మేయర్ భర్త దండు శేఖరే. అందుకే ఫస్ట్‌ స్పాట్‌ పెట్టాడు సీపీ అతనికి. బైండోవర్ చేశాడు. ఇక కథ మొదలైంది. ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే బామ్మర్ది నుంచి తాజాగా షోడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న వినయ్‌కుమార్‌ బామ్మర్ధి చిట్టిబాబు వరకు ఎవరినీ వదలేలా లేడు సీపీ. తవ్విన కొద్దీ ఈ అక్రమార్కుల జాబితా బయటకు వచ్చింది. ఇక స్పాట్‌ పెట్టడమే మిగిలింది. బీఆరెస్, కాంగ్రెస్‌ తేడా ఏమీ లేదు. ఎవరు చెప్పినా వినేది లేదు. ఇక్కడ ఉన్న సీతయ్య… అదే కల్మేశ్వర్.!!

You missed