దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

వీరిరద్దరూ కేసీఆర్‌కు దగ్గర. అత్యంత ఆప్తులు. ఇద్దరికీ కేసీఆర్‌ దగ్గర మంచి గౌరవం ఉంటుంది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా బీఆరెస్‌ పార్టీకి వీరిద్దరే పెద్ద దిక్కు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఎడముఖం పెడముఖం అయ్యారు. మాట్లాడుకోవడం లేదు. అంతరంగీల దగ్గర మాత్రం మాటల తూటాలు వదలుతున్నారు. అసలు వీరిద్దరికీ ఎందుకు చెడింది…? ఎవరా ఇద్దరు..? ఏమిటా లొల్లి…? ఇవిగో వివరాలు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇద్దరు మాట్లాడుకోవడం ఏమో గానీ ఒకరిపై ఒకరు మాటలు అనుకునే స్థాయికి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం డీసీసీబీ వ్యవహారమే.

బడా కాంట్రాక్టర్‌, బీఆరెస్‌ లీడర్‌ , డీసీసీబీ వైస్‌ చైర్మన్‌గా ఉన్న కుంట రమేశ్‌రెడ్డి.. ప్రశాంత్‌రెడ్డికి బంధువు, ఆప్తుడు. అధికారంలో ఉన్నప్పుడు దగ్గరుండి అన్ని పనులు చక్కదిద్దుకున్నాడు. ప్రభుత్వం మారగానే తన సోదరుడైన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ద్వారా డీసీసీబీ పదవి కన్నేశాడు. అప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న భాస్కర్‌రెడ్డి కుర్చీ లాగేసుకున్నాడు. ఈ కథ ముగిసింది. అందిరకీ ఇంతే తెలుసు.

కానీ ఆ తరువాతే రాజకీయ పరిణమాలు తీవ్రంగా మారాయి. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అతను కుమారుడు భాస్కర్‌రెడ్డి.. ప్రశాంత్‌రెడ్డిపై ఒంటికాలిపై లేస్తున్నారు. దీనంతటికీ కారణం ప్రశాంత్‌రెడ్డేనని బాహాటంగానే మండిపడుతున్నారు. రమేశ్‌రెడ్డిని ఎగదోసింది కూడా ప్రశాంత్‌రెడ్డేనని ఆరోపిస్తున్నారు. తను అడ్డుచెప్పకపోవడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం తదితర కారణాలను ఉదాహరణగా చెబుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బీఆరెస్‌ పార్టీకి వీరిద్దరే ఇప్పుడు పెద్ద దిక్కు. నిజామాబాద్‌ జిల్లాతో పాటు, కామారెడ్డి జిల్లాలో కూడా చాలా మంది నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. చావు తప్పి కన్నులొట్టబోయిన ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో డీసీసీబీ చైర్మన్‌ గిరీ వ్యవహారం ఇద్దరి మధ్యలో చిచ్చుపెట్టింది.

You missed