దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి :
నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎవరికి దక్కుతుందో గానీ మూడు పార్టీల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠను రాజేస్తున్నాయి. ఇప్పుడిది ఇద్దరి మాజీ మంత్రులకు ఇజ్జత్ కా సవాల్‌గా మారింది. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఈ ఎన్నికలు ముగిసిన తరువాత మంత్రి పదవి ఖాయంగా వస్తుందని ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇప్పుడు తాజాగా ఆయనకే పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇప్పటికే చేరికలు, అభ్యర్థి ఎంపికలో తనదైన ముద్ర వేసుకంటున్న సుదర్శన్‌రెడ్డి, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింత దూకుడుగా పనిచేస్తున్నాడు. ఆయన ఆ పార్టీకి జిల్లాకు పెద్ద దిక్కుగా చూస్తున్న నేపథ్యంలో ఏది చెప్పినా చెల్లుబాటు అవుతోంది. దీంతో ఆయన చెప్పినట్టు నడుస్తోంది.
ఎలాగైనా ఈ సీటును గెలిపించి అధిష్టానానికి బహుమతిగా ఇస్తే.. తనకు మరింత గౌరవం పెరిగినట్టు ఉంటుందని భావిస్తున్నాడాయన. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పెద్దాయనలో టెన్షన్ పెరుగుతోంది. ఇక మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విషయానికొస్తే.. ఆయనకు ఇప్పుడు జిల్లా పార్టీ పరువును కాపాడే బాధ్యతను భుజానికెత్తింది అధిష్టానం. జిల్లాకు వారు పెద్ద దిక్కుగా భావిస్తున్న ఎమ్మెల్సీ కవిత జైలుకు పోవడంతో.. ఇప్పుడు మాజీ మంత్రిగా ప్రశాంత్‌రెడ్డిపై పార్టీని కాపాడుకునే గురుతర బాధ్యత పడింది.
దీనికి తోడు పార్టీ అభ్యర్తిని కూడా గెలిపించుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. మంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గానికే పరిమితమైన వేముల ఇప్పుడు అంతా తానై నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పట్టును పెంచుకునేందుకు యత్నిస్తున్నాడు. క్యాడర్‌లో భరోసా నింపి వలసలను నివారించడంతో పాటు ఉన్నవారితో నిబద్దతతో పనిచేయించుకుని అభ్యర్థి గెలుపులో తను కీలకంగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు.