దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
మేము మంచివారమే. జనాలే తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఏవో పథకాలకు ఆశపడ్డారు. మోసపోయారు. అత్యాశకు పోయారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు…. ఇవీ కరీంనగర్‌లో కేసీఆర్ మాట్లాడిన మాటలు. ఇన్నేండ్లు సీఎంగా చేసిన కేసీఆర్.. ఉద్యమ నేతగా తెలంగాణ పోరాటం చేసిన కేసీఆర్ మాటల్లో అవే అహంకారపు ఆనవాళ్లు. ప్రజాతీర్పును గౌరవించడం అటుంచి జనాలనే తప్పుబట్టే దోరణి ఇంకా ఉంది. మొన్న నల్లగొండ సభలో అవే మాటలు.. కామారెడ్డిలో నిన్న కేటీఆర్ అవే మాటలు. ఇప్పుడు కరీంనగర్‌లో కూడా అవే జనాలను తప్పుబట్టే మాటలే. పశ్చాత్తాపం ఎక్కడా కనిపించలే. మా పొరపాట్లు ఉన్నాయని ఒప్పుకోలూ లేదెక్కడ. లోపాలను గుర్తించి మాట్లాడే దోరణీ కనిపియ్యలే. మేమంతా సక్కనోళ్లమే. మీరే దురాశపరులు.. ఆశకు పోయారు.. మోసపోయారు… మంచి శాస్తి జరిగింది మీకు రీతిలో కేసీఆర్ మాట్లాడటం ఆయన విపరీత అహంకార మనస్తత్వానికి అద్దం పడుతోంది.
సీఎం రేవంత్ మాట్లాడే భాషను విమర్శించాడు కేసీఆర్. బాగానే ఉంది. సీఎం అలా మాట్లాడొచ్చా.. ఇజ్జత్ తీస్తున్నడనే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. బాగనే ఉంది. ఇక పథకాల విషయంలో అమలు జరగడం లేదనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు భాష, అమలు సాధ్యం కాని పథకాలు, అబద్దపు ప్రచారాలు ఇవన్నీ నీ బాటలో సాగుతున్నట్టే ఉన్నాయి. అయినా.. జనాలు నిన్ను చీత్కరించారు. నీ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. ఆ పాలన పై మాట్లాడు. పథకాల అమలుపై మాట్లాడు. సీఎం తీరుపై మాట్లాడు. కానీ జనాల తీర్పును ప్రశ్నిస్తున్నావంటే నీలో ఇంకా అధికార అహంకారం తగ్గలే కేసీఆర్. ఓడిన తరువాత జిల్లాల్లో ఉన్న లీడర్లను పట్టించుకున్నావా.? మాట్లాడినవా..? సిట్టింగులు చేసిన వినాశనం గురించి తెలుసుకున్నావా.? పార్టీనీ వీడిపోకపోతే ఇంకా ఉంటారా..? వారికి జరిగిన మేలేంటి. ఉద్యమకారులకు చేసిన గౌరవ, మర్యాదలెట్టివి కేసీఆర్..?
తనేదో ఓడిపోయి ఇలా అయ్యానే గానీ లేకపోతేనా దేశాన్ని ఓ ఊపు ఊపుతుంటి అని మాట్లాడిన మాటలు తుపాకి రాముడి మాటల్లాగే భావిస్తారు. ఎందుకంటే నువ్వే అన్నావ్‌గా.. కాల పరిణామాలు మారుతూ ఉంటాయని. నక్కకు నాగలోకానికి తేడా అని వినోద్, బండి సంజయ్ గురించి అన్నావ్.. ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీ ఎంతైనా. ఇక్కడా జనాల తీర్పును అవమానించినట్టు మాట్లాడితే నిన్ను గొప్ప అనుకోరు. అహంకారం దిగలే అనుకుంటారు. ఏం చేశావని ప్రశ్నించు. అంతవరకే. అధికారం కోసం ఏవేవో అలవిమాలిన హామీలు, పథకాలు ప్రకటించి ఖజానాను దివాళా తీసింది నువ్వు. నీ బాటలోనే రేవంత్ నడుస్తున్నాడు. ఇద్దరికీ పెద్ద తేడాలేదు కేసీఆర్. నీ పాలనతో విసిగెత్తిపోయారు. కాంగ్రెస్‌కు చాన్సిచ్చారు. ఇక్కడ అదే రిపీట్ అయితే నీకు లాగే రేవంత్‌కు, కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెడతారు జనాలు. నువ్వే అన్నావుగా జనాలు చైతన్యవంతులని. మరి ఎందుకు వారిని అవహేళన చేసి మాట్లాడటం. కొంచెం ఓపిక పట్టు. ఇప్పటికిప్పుడు అధికారమయితే రాదు.