దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

పార్టీలన్నీ ఒక్కతాను ముక్కలే. సీఎంలు వేర్వేరు. ఆచరణ మాత్రం అగ్రవర్ణాలకు అగ్రతాంబూలమే. ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా రెడ్ల రాజ్యమే కదా. ఇవాళ ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. బట్టికి అవమానం జరిగిందని. దళితులకు ఇదేనా మీరిచ్చే గౌరవమని. ఏవేవో పెద్ద పెద్ద మాటలు. పాపం..! వారికి తెలియదనుకుంటా. ఇది రెడ్ల రాజ్యం. రేవంత్‌ రెడ్డి సీఎంగా.. రేపు మరో కాంగ్రెస్‌ రెడ్డి సీఎంగా ఇంతకు మించి పెద్దగా ఊహించుకోవడం మన భ్రమ. పెద్దగా ఫీల్‌కావాల్సిన పని కూడాలేదు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసే ఉద్దేశం తప్ప. ఆ పార్టీలో పెద్ద మార్పేమీ ఉండబోదు. ఉండదు.

కేసీఆర్‌ సీఎంగా ఉన్న పదేళ్లలోనూ బహుజనులు చెంచాలుగానే ఉపయోగపడ్దారు. అట్లనే ఉపయోగించుకున్నాడు కూడా. రెడ్లంటే కేసీఆర్‌కు భయం. అందుకే వారికే అగ్రతాంబూలమిచ్చాడు. ఆఖరికి మల్లారెడ్డి లాంటి జోకర్‌కు కూడా మంత్రి పదవి ఇచ్చాడు. రౌడీ షీటర్‌కు ఎక్కువ. గుండాగిరీకి తక్కువ అన్నట్టున్న పట్నం మహేందర్‌రెడ్డిని ఉన్నపళంగా మంత్రిని చేసిన ఘనత మన కేసీఆర్‌ది. అందుకే ఆ పార్టీ. ఈ పార్టీ అని కాదు. అంతా ఒక్కటే. ఈ ఫోటోను షేర్‌ చేసి మన ఆర్ఎస్పీ.. అందుకే బీఎస్పీ ఉన్నది.. మార్చేస్తాం… ఏదో చేసేస్తామంటూ ట్వీట్‌ చేశాడు. దొరకాళ్ల దగ్గరకు ఓ ఎంపీ టికెట్‌ ఇచ్చి పైసలు పెట్టి గెలిపించు అని పాకులాడిన ఆర్ఎస్పీ కూడా మాట్లాడవట్టే. నవ్వులాటకాకపోతే.

తెలంగాణలో కచ్చితంగా రెడ్ల రాజ్యమే ఉంటది. అది బీఆరెస్‌ అయినా.. కాంగ్రెస్‌ యినా.. రేపు బీజేపీ వచ్చినా..! బీసీలు, దళితులు రాజకీయ అస్తిత్వం కోసం కొట్లాడుతూనే ఉండాలి. పదవుల కోసం బిచ్చమెత్తుకుంటూనే ఉండాలె. కాస్త కఠినంగా ఉన్నా.. వినడానికి కఠోరంగా ఉన్నా.. పలకడానికి చేదుగా ఉన్నా ఇదే పచ్చి నిజం. కాదంటారా..!

You missed