దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

మోడీ మోఖా చూసి దెబ్బ కొట్టాడు. ఎట్టకేలకు కవిత అరెస్టయ్యింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ , ఐటీ సోదాల పేరుతో హైడ్రామా క్రియేట్ చేసి పక్కా ప్లానింగ్‌తో సాయంత్రం అరెస్టు చేశారు. దీంతో ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. సీఎం కేసీఆర్‌ కూతురు, మజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్‌ స్కారం కేసులో దొరకబట్టిన కేంద్రం.. తన రాజకీయ చదరంగంలో పావుగా వాడుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు ఈ కథకు చెక్‌ పెట్టింది. ముందే ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసి మరీ వచ్చి సోదాలో పేరుతో డ్రామాలు చేశారు. ఆ తరువాత కవితను అరెస్టు చేసి ప్రత్యేక వాహనం ద్వారా ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు.

ఈ విషయంలో న్యాయపరంగా ఎన్ని ఎత్తులు వేసినా బీఆరెస్‌కు చేదు అనుభవమే మిగిలింది. పక్కాగా అన్ని విధాలుగా ఈకేసులో కవితను ఇరికించింది కేంద్రం. సమయం కోసమే వేచి చూసింది. వాస్తవానికి కవితను అరెస్టు చేయడం కేంద్రానికి పెద్ద లెక్క కాదు. ఇప్పటి వరకు వేచి చూడాల్సిన అవసరమూ లేదు. కానీ బీజేపీ ఈ విషయాన్ని పక్కా రాజకీయంగానే చూసింది. అందుకే సమయం చూసి దోఖా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ పరిస్థితి ఏమిటో గమనించింది. కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించారు. ఘోర పరాభవం మూటగట్టుకున్నాడు కేసీఆర్‌. దీంతో పార్లమెంటులో కూడా బీఆరెస్‌కు అంత సీన్‌లేదని తేలింది.

ఇక దేశ రాజకీయాల్లో కేసీఆర్‌కు ముఖమే లేకుండా పోయింది. స్వయంగా మొన్న కరీంనగర్‌ సభలో కేసీఆరే ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇంత జరిగిన తరువాత ఇద్దరి మధ్య రహస్య స్నేహబంధం ఉందనే ప్రచారాన్ని ఇంకా కొనసాగించడం బీజేపీకి ఇష్టం లేదు. వాస్తవానికి ఈ ప్రచారం బీజేపీకే ఇప్పుడు ఎక్కువ నష్టం. ఇప్పుడు కవితను అరెస్టు చేస్తే బీజేపీకి ప్రస్తుతం కొనసాగుతున్న హవాతో పాటు మరింత రాజకీయబలాన్ని ఈ అరెస్టు వ్యూహం చేకూరుస్తుందని బీజేపీ అంచనా వేసింది. అందుకే ఇలా స్పాట్ పెట్టింది. కవిత అరెస్టు పరిణామంతో బీఆరెస్‌ ఒక్కసారిగా మరింత డీలా పడిపోయింది. ఇప్పటికే అన్ని జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

కవిత అరెస్టు పర్వంతో మొదలు.. ఇక కీలకమైన వికెట్లపై కేంద్రం దృష్టి పెడుతుందని భావిస్తున్నారు. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్‌కు ఒకరోజు ముందే కవితను అరెస్టు చేయడం పక్కా రాజకీయ వ్యూహమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కవిత అరెస్టు బీఆరెస్‌కు సానుభూతిని తెచ్చిపెడుతుందా..? అంటే ఇంతకు ముందులా పరిస్థితి లేదు. చేజేతులా కేసీఆర్‌ తనపై పార్టీపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు. దీంతో ఈ అరెస్టుతో బీఆరెస్‌కు నయాపైసా లాభం లేకపోగా.. భారీ నష్టమేనని చెప్పొచ్చు.

 

You missed