దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: బీజేపీ అధిష్టానం బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్‌కు సిట్టింగు ఎంపీగా ఉన్న అర్వింద్‌కే మళ్లీ చాన్సిచ్చింది. జహీరాబాద్‌ ఎంపీ స్థానానికి మొన్ననే పార్టీ జంప్ అయిన బీబీ పాటిల్‌ పేరు ప్రకటించేసింది. దీనిపై బీఆరెస్‌ వర్గాలు ‘సోషల్‌’ దాడి మొదలు పెట్టారు. బీబీ పాటిల్‌ను తెలుగరాని సన్నాసి అంటూ సోషల్‌ మీడియాలో సంబోధిస్తూ అతను పార్టీ నుంచి వెళ్లిపోవడమే బెటర్‌ అని కామెంట్లు పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. తెలుగురాని వాడిని టికెట్‌ ఇచ్చి ఎంపీ చేసిన చరిత్ర బీఆరెస్‌ది అంటూ పనిలో పని తమ అధినేత కేసీఆర్ గొప్పతనాన్ని ఇక్కడ కీర్తించేస్తున్నారు.

వాస్తవానికి బీబీ పాటిల్‌పై బీఆరెస్‌లో ఎప్పటినుంచో చాలా వ్యతిరేకత ఉంది. పార్టీ క్యాడర్ ను ఏనాడూ పట్టించుకోలేదనే కోపం వారికుంది. గత ఎంపీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా పాటిల్‌ రెండోసారి గెలిచాడు. అప్పటి నుంచి ఇంకా వ్యతిరేకత పెరిగింది బీఆరెస్‌ క్యాడర్‌లో. దీనికి తోడు పాటిల్‌ కూడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవాడు కాదు. తన వ్యాపారం తనది. దీంతో ఈసారి కచ్చితంగా టికెట్‌ ఇవ్వొద్దని డిసైడ్‌ అయ్యింది బీఆరెస్. ఇంత ఎదురుగాలిలోనూ పాటిల్‌కు టికెట్‌ ఇవ్వొద్దని భావించిందంటే అటు జనాల నుంచి అటు పార్టీ నుంచి ఎంతటి వ్యతిరేకత మూటగట్టుకున్నాడో తెలిసిపోతున్నది. ఇప్పుడు ఇలా పార్టీ మారగానే బీజేపీ ఎంపీ టికెట్‌ ప్రకటించగానే తమ అక్కసంతా సోషల్‌ మీడియలో ఇలా వెళ్లగక్కుతున్నారు బీఆరెస్‌ సోషల్‌ మీడియా వారియర్స్‌. మరోవైపు బీజేపీలోనూ అధిష్టానం ఎంపికపై మండిపడుతున్నారు. అక్కడ చెల్లని రూపాయి మనకెందుకనే ఫీలింగ్‌ ఆ పార్టీలో చాలామందికే ఉంది.

నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్‌కు అవకాశం ఇవ్వడం పట్లా చాలా మంది గుర్రుగానే ఉన్నారు ఆ పార్టీలో. అర్వింద్‌ బీజేపీ సీనియర్లను, కరుడుగట్టిన క్యాడర్, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అనుబంధ సంఘాల నేతలతో సరిగ్గా లేడు. వారికి ప్రాధాన్యం తను ఎంపీగా గెలిచిన నాటి నుంచీ ఇవ్వలేదు. దీంతో మొదటి నుంచి వీరంతా అర్వింద్‌ పట్ల అంటిముట్టనట్టుగానే ఉంటూ వస్తున్నారు. ఇలా మరోసారి టికెట్ ఇవ్వడం పట్ల లోలోన తీవ్ర అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరిపై ఉన్న వ్యతిరేకత సైలెంట్‌గా ఓటింగ్‌గా మారితే కొంపలు ముంచడం ఖాయం.

You missed