దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి:

సీనియర్‌ బీజేపీ లీడర్‌ యెండల లక్ష్మీనారాయణకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతకు ముందు ఎమ్మెల్యేగా నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి తనకు అవకాశం ఇస్తే ఈసారి గెలుస్తానేమోనని కూడా ఆశపడ్డాడు. కానీ అర్వింద్‌ వెంటాడాడు. పార్టీలో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వైరం ఉంది. తన తండ్రి డీఎస్‌ అప్పుడు బాజిరెడ్డిని బాన్సువాడ పంపి తన శత్రుశేషం లేకుండా చేసుకోవాలనుకున్నాడో.. కొడుకు కూడా అదే ఫార్మూలాను పాటించాడు. యెండల లక్ష్మీనారాయణను బాన్సువాడ పంపి తనకు కావాల్సిన వారికే నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో టికెట్లు ఇప్పించుకున్నాడు.

బాన్సువాడలో ఎలాగూ గెలవలేనని యెండలకు తెలుసు. కానీ ఆయన దృష్టంతా నిజామాబాద్‌ పార్లమెంటు మీద ఉంది. దీని కోసం చివరి వరకూ ట్రై చేశాడు. కానీ అంతా ఊహించినట్టే మళ్లీ ఇక్కడ నుంచి అర్వింద్‌కే చాన్స్‌ ఇచ్చింది అధిష్టానం. ఇక లాభం లేదని జహీరాబాద్‌ నుంచి కూడా ట్రై చేశాడు. కానీ అక్కడ సిట్టింగ్‌ఎంపీ బీబీ పాటిల్‌ బీజేపీ గూటికి చేరాడు. బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థిగా బీబీ పాటిల్‌ పేరు ఫైనల్ అయిపోయింది. యెండలకు ఇక్కడి నుంచి కూడా టికెట్‌ రాకుండా అడ్డుకున్నది అర్విందేనని ప్రచారం జరుగుతోంది.

పార్టీని అంటిపెట్టుకుని ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న యెండల లక్ష్మీనారాయణకు అర్వింద్‌ ఎంట్రీ తరువాత గడ్డుకాలమే వచ్చింది. తాజాగా ఆయనకు అవకాశాలు రాకపోవడమే దీనికి నిదర్శంగా నిలుస్తోంది. రాజకీయంగా యెండలను ఎదగనీయకుండా అర్వింద్‌ వేటాడుతూనే ఉన్నాడు. వెంటాడుతూనే ఉన్నాడు.

You missed