దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
vastavam exclusive story
ఎంపీ ఎన్నికల వేళ మళ్లీ పసుపు రైతులు, పసుపు ధర అంశం రాజకీయ తెరపైకి వచ్చింది. పసుపు రైతులకు మద్దతుగా నిలిచి .. బోర్డు ఏర్పాటు చేయని అంశాన్ని నిలదీని బీజేపీని ఎండగట్టాల్సిన బీఆరెస్,కాంగ్రెస్ పార్టీలు చేష్టలుగిడి చూస్తున్నాయి. అవగాహన రాహిత్యంతో రాజకీయ పలాయనవాదం ఎంచుకున్నాయి. విచిత్రమేమిటంటే.. ఈ ఎన్నికలు బీజేపీకి శాపంగా మారాల్సి ఉండగా.. వరంగా మారాయి. ఎన్నికల వేళ పసుపు ధర ప్రస్తుత మార్కెట్లో క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు పలుకుతుంది. దీంతో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇదే తన ఘనకార్యమే అన్నట్టు బీరాలు పోతుండగా.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దీన్ని నిలువరించని నిస్సహాయ స్థితిలో చతికిలబడిపోయాయి.
వాస్తవానికి గత నాలుగైదేండ్ల నుంచి జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం సగానికి పడిపోయింది. గతంలో జిల్లాలో పసుపుకు పెట్టింది పేరు. దాదాపు 70వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. కానీ సరైన మద్దతు ధర రాక, పసుపు బోర్డు పేరిట నేతల కాలయాపన, బాండు పేపర్‌తో రాజకీయ క్రీడ.. ఇవన్నీ కలిపి పసుపు రైతులను నట్టేట ముంచాయి. దీంతో పసుపుకు ఎకరాకు అయ్యే సాగు పెట్టుబడి లక్ష నుంచి లక్షన్నర పెరగగా.. మద్దతు ధర మాత్రం ఏడువేలకు మించలేదు. దీంతో ఈ సాగు నుంచి రైతు తప్పుకున్నాడు. దీంతో ప్రస్తుతం పసుపు సాగు 35 వేల ఎకరాలకు మాత్రమే పరిమితమయిపోయింది. దీనికి తోడు ఎగుమతులకు కాలక్రమేణా డిమాండ్ పెరగడంతో రేటు పెరిగింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నది బీజేపీ.
ఈ పెరిగిన రేటు ఉత్సాహంతో బీజేపీ ఎంపీ అర్వింద్.. మళ్లీ తన పాత రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆనాడు పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ రాసిన అంశాన్ని ఇప్పుడు మళ్లీ తన ఎన్నికల అస్త్రంగా వినియోగించనున్నాడు. మరో రెండేళ్లలో పసుపుకు క్వింటాల్‌కు 20 వేలు ఇస్తానన్నాడు. మళ్లీ బాండ్ పేపర్ కూడా రాస్తానని ప్రకటించేశాడు. ఇంత జరుగుతున్నా.. బీఆరెస్, కాంగ్రెస్ నేతలు కిమ్మనకుండా చూస్తుండిపోయారు. పైగా గురువారం సీఎం రేవంత్‌రెడ్డి తన ట్వీట్‌తో పసుపుపై అవగాహన లేకుండా మెసేజ్ పెట్టి అర్వింద్ నెత్తి మీద పాలు పోసినట్టే చేశాడు. పసుపుకు బాగా ధర వస్తున్నది… బోర్డు ఏర్పాటు చేస్తే మరీ మంచిది అంటు తగుదునమ్మా అని ఓ ఉచిత సలహా పడేశాడు.
ఎలాగూ మేము బోర్డు ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ చెప్పుకునేందుకు అన్ని రెడీ చేసుకున్నది. పనిలో పని మొన్న ప్రధాని మోడీతో ప్రకటన కూడా చేయించేసింది. గెజిట్ విడుదల చేసింది. ఇప్పుడు ఏకంగా అర్వింద్ మళ్లో బాండు రాస్తానని ప్రకటించినా.. ఐదేండ్ల నుంచి పసుపు రైతులు నష్టపోయిన అంశాన్ని ఇప్పటి వరకు ఎందుకు బోర్డు ఏర్పాటు కాలేదన్న కీలక అస్త్రాన్ని వదిలి ఎవరికి వారు రాజకీయ పలాయనవాదంతో బీజేపీని లేపుతున్నారే తప్ప ఆత్మరక్షణలో పడేయడానికి కావాల్సిన సరకు, సందర్భం మాలో లేదని తేల్చి చెప్పుకున్నారు.
dandugula srinivas
8096677451