దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి:
చాలా రోజుల తరువాత ఎమ్మెల్సీ కవిత జిల్లాలో అడుగుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆమె ఇటు వైపు రాలేదు. మధ్యలో కొన్ని ప్రోగ్రాంలకు హాజరుకావాల్సి ఉన్నా అవి రద్దయ్యాయి. దీనికి తోడు ఎంపీ ఎన్నికలకు సమయం దగ్గరపడటం, కవిత పోటీ చేయడం లేదని క్లారిటీ రావడంతో ఆమె జిల్లాకు మరింతగా దూరమయ్యింది. ఈ క్రమంలోనే ఆమె బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి పర్యటించారు. పలు వివాహాలకు హాజరుకావడంతో పాటు పరామర్శలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆమెను కలిసిన క్యాడర్ ఎంపీగా పోటీ చేయాలంటూ అభ్యర్థనలు చేయడం కనిపించింది.
‘ అక్క మీరొస్తేనే బాగుంటుంది..! మీరు ఎంపీగా పోటీ చేస్తేనే మనం గెలవగలుగుతాం..!’ అనే మాటలు చాలా చోట్ల క్యాడర్ నుంచి వినిపించాయి. వారి అభ్యర్థనను చిరునవ్వుతో స్వీకరించిన ఆమె.. ‘బాస్ చెబితే చేస్తా..!’ అని కేసీఆర్ పై భారమేసినట్టుగా మాట్లాడింది.