వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్ : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నిరంతరం ప్రజల సేవలో నిమగ్నమై ఉండే రెవెన్యూ శాఖను మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అట్టహాసంగా జరిగింది. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు హాజరై డైరీ, క్యాలెండర్ లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డిలు మాట్లాడుతూ, రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రితో పాటు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ చూపుతామని అన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు బదిలీ అయిన వీఆర్ఏ లను సొంత జిల్లాకు తిరిగి పోస్టింగ్ కల్పించేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇతర శాఖలలో నియమించబడిన వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేసేలా ముఖ్యమంత్రిని కోరుతామని తెలిపారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకెళ్తుందని అన్నారు. అందులోనూ అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు సైతం అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషి చేయాలని సూచించారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం ద్వారా అమలు చేసే కార్యక్రమాలలో రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు. ఏ కార్యక్రమమైనా సమర్థవంతంగా అమలు జరగాలంటే రెవెన్యూ శాఖ తోడ్పాటు అవసరం అవుతుందని, అందుకే జిల్లా పాలనాధికారులు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో రెవెన్యూ ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తారని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలలో తమ పరిధిలో ఉన్న వాటిని సత్వరమే పరిష్కరిస్తామని అన్నారు.

రెవెన్యూ ఉద్యోగుల సంఘం సేవలు భేష్ : ఎమ్మెల్సీ మహేష్ కుమార్

కాగా, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వివిధ వర్గాల వారికి అందిస్తున్న సేవలు ఎంతో భేషుగ్గా ఉన్నాయని శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు వారు వైద్య విద్యను అభ్యసించేందుకు రెవెన్యూ అసోసియేషన్ తోడ్పాటును అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించిన మహేష్ కుమార్ గౌడ్, వారికి తనవంతుగా కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం బాధ్యులు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులైన కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వేణు, శ్రీనివాసరావు, నాగార్జున, ప్రభు, శ్రీధర్, శశి తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి.

సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేలా చూడాలని రెవెన్యూ ఉద్యోగులు ఈ సందర్భంగా కోరారు.

 

ఇవీ సమస్యలు.. :

 

– వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేస్తూ వారిని దూర ప్రాంతాలకు అలాట్‌ చేశారు. ఖమ్మం, ఆసిఫాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ లాంటి ప్రాంతాలకు పంపారు. చిన్నస్థాయి ఉద్యోగులు కాబట్టి వీరిని సొంత స్థానాలకు తీసుకురావాలి.

– వీఆర్‌వో, వీఆర్‌ఏలను గత ప్రభుత్వంలలో వేర్వేరు శాఖలకు బదిలీ చేశారు. ఆశాఖలలో పెద్దగా పని లేనప్పటికీ అదే శాఖలో వారు కొనసాగుతున్నారు. రెవెన్యూ శాఖలో తీవ్రమైన పని ఒత్తిడితో, ఉద్యోగుల కొరతతో ఇబ్బంది పడుతున్నందున తిరిగి వీఆర్‌ఓ, వీఆర్ఏలను రెవెన్యూశాఖలోకి మార్చాలి.

– 55 ఏళ్ల నుంచి 61 ఏళ్ల ఉద్యోగుల స్థానంలో వారి వారుసులకు ఉద్యోగాలు కల్పించాలి.

– కంప్యూటర్‌ ఆపరేటర్లు, హ్యాండ్‌ హోల్డింగ్‌ పర్సన్స్‌లందరికీ ఉద్యోగ భద్రత కల్పించి హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి.

– ఉద్యోగులందరికీ సొంత కాంట్రిబ్యూషన్‌తో అయినా సరే ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌తో సంబంధం లేకుండా కార్పొరేట్‌ స్థాయి ఇన్సురెన్సు కంపెనీలతో టయప్‌ చేసి ‌ క్యాష్‌లెస్‌ వైద్యం అందేలా ఆరోగ్య భద్రత కల్పించాలి.

You missed