దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

ఎవరైనా పార్టీలో చేరుతానంటే రారమ్మంటారు. అదీ పార్లమెంటు ఎన్నికల వేళ. కానీ మార్క్‌ఫెడ్ చైర్మన్‌ మార గంగారెడ్డి పరిస్థితి ఇక్కడ రివర్స్‌ అయ్యింది. బీఆరెస్‌ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతానని తానే స్వయంగా ప్రకటించుకుని పది రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ‘పెద్దలు’ స్పందించింది లేదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో టచ్‌లో ఉన్న మార గంగారెడ్డి.. తాను పార్టీ వీడుతానని చెప్పడంతో ఆ విషయాన్ని సీఎం రేవంత్‌కు తెలియజేశాడు. కానీ రేవంత్‌ మాత్రం జిల్లాకు పెద్ద దిక్కు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఉన్నాడు కదా.. ఆయనతో కలిసి పార్టీలో చేరమని సలహా ఇచ్చాడు.

ఇదిగో ఇక అక్కడ్నుంచి ‘మార’కు ఎదురుచూపులే మిగిలాయి. సుదర్శన్‌రెడ్డి స్పందించినట్టే స్పందించి.. ఆ తరువాత ‘మరిచిపోయాడు’. నేడు రేపు అంటూ పది రోజుల కాలయాపన జరిగిపోయింది. ఆర్మూర్‌ ఇన్చార్జి వినయ్‌రెడ్డి కూడా మార రాకను స్వాగతిస్తూనే కౌన్సిలర్లు కూడా చేరతారని, అంతా ఒకేసారి ప్రోగ్రాం పెట్టుకుందామని అన్నాడు. కానీ ఆలోపు మాజీ ఎమ్మెల్సీ డీ రాజేశ్వర్‌ చేరిక జరిగిపోయింది. తాజాగా ఆర్మూర్‌కు చెందిన 17 మంది కౌన్సిలర్లూ చేరిపోయారు. కానీ మార గంగారెడ్డి చేరిక మీద మాత్రం ఉలుకూ లేదు పలుకూ లేదు.

ఎందుకిలా..? ఆర్మూర్‌ నుంచి వచ్చే ఎన్నికల్లో తనకు కొరకరాని కొయ్యగా మార గంగారెడ్డి మారుతాడని వినయ్‌రెడ్డే అడ్డుకుంటున్నాడా..? లేకపోతే తనను సంప్రదించకుండా పొంగిలేటితో వెళ్లి కలిసి రావడం మాట తీసుకోవడం పెద్దాయన ఇగోను హర్ట్ చేసిందా..? ఏం జరిగిందో ఏమో గానీ పాపం.. మార గంగారెడ్డి మాత్రం వీళ్లు ఎప్పుడు టైం ఇస్తారా..? ఎప్పుడు పార్టీ మారుదామా ..? అని వెయిట్ చేస్తున్నాడు.

You missed