దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

 

ఎమ్మెల్సీ కవిత ఎంపీ పోటీ బరి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె పోటీ చేయడం సరైన నిర్ణయం కాదని అధిష్టానం అభిప్రాయపడింది. దీంతో టికెట్‌ ఎవరికివ్వాలో వేట మొదలైంది. వారం రోజుల ఫ్లాష్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలి..? ఎవరికిస్తే గెలుస్తారు… ?? మిగిలిన పార్టీల పరిస్థితి ఏమిటి..? వాటి బలాబలామిటీ..? అనే అంశాలపై సర్వే చేస్తున్నారు. బీజేపీ నుంచి అర్వింద్‌ పోటీ చేయనున్న నేపథ్యంలో బీఆరెస్‌ కూడా బీసీకే టికెట్‌ ఇవ్వాలనుకుంటున్నది. ప్రధానంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పద్మశాలిలు, మున్నూరుకాపుల సంఖ్య ఎక్కువ. వీరిలో ఎవరికో ఒకరి ఇద్దామనేది బీఆరెస్‌ ఆలోచన. అందులో భాగంగా కొందరి పేర్లను కూడా సర్వేలో వెల్లడిస్తున్నారు. వీరు పోటీ చేస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నారు.

పద్మశాలి వర్గం నుంచి ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, మున్నూరుకాపు నుంచి రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ల పేర్లను కూడా ఫ్లాష్‌ సర్వేలో వెల్లడిచేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకుని మరో రెండు రోజుల్లో అధిష్టానానికి ఈ సర్వే రిపోర్టును నివేదించనున్నారు. మొన్నటి వరకు ఇక్కడి నుంచి కవితే పోటీ చేస్తుందనే ఆశతో ఉన్న సీనియర్‌ నేతలు, ఉద్యమకారులకు ఇది ఊహించని పరిణామంగా మారింది. పార్టీ పరిస్థితి ఇప్పటికే అంతంతమాత్రంగా ఉంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమె పోటీలో ఉంటే కనీసం క్యాడర్ అంతా మళ్లీ ఏకమవుతుంది.. ఉత్సాహం ఉంటుందని భావించారు. కానీ కవితను పోటీకి దూరంగా ఉంచుతున్నారు. జిల్లా అధ్యక్షుడిని మార్చే విషయంలో కూడా పెద్దగా చలనం లేదు.

పార్టీకి జవజీవాలు అందించే విషయంలో కేటీఆర్‌, కేసీఆర్ పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. పార్లమెంటు ఎన్నికలకు రోజులు సమీపించేకొద్దీ బీఆరెస్‌ క్యాడర్ చెల్లాచెదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయం పార్టీ అగ్రనేతలకూ తెలుసు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రస్తుతం వారున్నారు.

You missed